టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ ఆయన. బాక్సాఫీస్ వద్ద వరుసగా విజయ పరంపరను కొనసాగిస్తూ, అపజయమే ఎరుగని హిట్ మెషిన్ గా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. `పటాస్` నుంచి మొదలుకొని మొన్న సంక్రాంతికి వచ్చిన `మన శంకరవరప్రసాద్ గారు` వరకు ఆయన ప్రయాణం ఒక ప్రభంజనం. అయితే, ఇంతటి ఘనవిజయాలు ఆయన ఖాతాలో ఉన్నా, తనలోని సామాన్యుడు మాత్రం ఎప్పుడూ మారలేదని ఆయన నిరూపిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ వస్తేనే మారిపోయే వ్యక్తులు ఉన్న ఈ రోజుల్లో, అనిల్ రావిపూడి తన నైజాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయంలో ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``నేను ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. కష్టాలు చూశాను కాబట్టే నాకు మనుషుల విలువ తెలుసు. ఇప్పుడు 9 హిట్లు వచ్చాయని కాదు, రేపు పొద్దున 99 హిట్లు వచ్చినా నా వ్యక్తిత్వం మారదు. నేను నేల మీద నడవడానికే ఇష్టపడతాను. ఇప్పటికీ తనకు తెలిసిన వారు రోడ్డు మీద కనిపిస్తే కారు దిగి పలకరించడం, వారితో టీ తాగడం వంటివి నాకు అలవాటు. మనిషిని మనిషిలా గౌరవించడమే నాకు తెలుసు`` అని ఆయన చెప్పుకొచ్చారు.
అనిల్ రావిపూడిలోని ఈ నిరాడంబరత కేవలం అభిమానులనే కాదు, సినిమా స్టార్లను కూడా ఆకట్టుకుంటోంది. మొత్తానికి తన సినిమాతో ప్రేక్షకులను నవ్వించడమే కాదు, తన ప్రవర్తనతో తోటివారిని మెప్పించడం కూడా ఒక గొప్ప కళ అని అనిల్ రావిపూడి ప్రూవ్ చేస్తున్నారు.