2025 ఏడాది చివరి రోజు డిసెంబరు 31న కేజీ వెండి ధర అక్షరాల రూ.2.40 లక్షలు. కొత్త ఏడాది మొదటి రోజున కేజీకి రూ2వేలు తగ్గింది. కట్ చేస్తే.. కొత్త సంవత్సరం మొదటి నెల (జనవరి) క్యాలెండర్ లో 20 రోజులు పూర్తైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. వెండి ధరలో మార్పులు చేర్పులు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిందని చెప్పాలి. రోజు రోజుకు అంతకంతకూ పెరుగుతూ.. అంచనాలకు భిన్నంగా.. ఊహించని రీతిలో భారీగా పెరగటమే కాదు.. వెండి జీవితకాలంలో మరెప్పుడూ నమోదు కానంత భారీగా పెరిగిపోయింది.
జనవరి 20న కేజీ వెండి రూ.3.40 లక్షలుగా ఉంటే.. మూడు రోజులు తిరిగేసరికి కేజీ వెండి ధర రూ.3.60 లక్షలకు చేరుకుంది. మరో మూడు రోజులకు అంటే జనవరి 26 నాటికి కేజీ వెండి ధర రూ.3.75 లక్షలకు చేరుకుంది. తర్వాతి రోజుకు (జనవరి 27) కేజీ వెండి రూ.3.87 లక్షలకు చేరుకోగా.. ఆ తర్వాతి రోజు (జనవరి 28) ఏకంగా రూ.4 లక్షల మార్కును టచ్ చేసింది. ఇక.. జనవరి 29న చరిత్రలో అత్యంత పీక్స్ కు చేరుకున్న వెండి కేజీ ధర రూ.4.25 లక్షలకు చేరుకుంది.
అంటే.. జనవరి 1 నుంచి జనవరి 29నాటికి కేజీ వెండి పెరిగింది అక్షరాల రూ.83 వేలు. మూడు లక్షల రూపాయిల పెట్టుబడి పెడితే.. 29 రోజుల్లో రూ.83 వేల లాభం అంటే.. ఏం వ్యాపారం చేస్తే అంత భారీగా సంపాదించే వీలుంది. ఇలా ఆకాశమే హద్దుగా పెరిగిన వెండి ధరలతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అప్పటివరకు కేజీ వెండి రూ.5 లక్షల్నిటచ్ చేస్తుందని అంచనాలు వినిపించినోళ్లు.. రానున్న రోజుల్లో కేజీ వెండి రూ.8లక్షల్ని టచ్ చేస్తుందన్న మాట వినిపించింది.
దీంతో.. తమ కళ్ల ముందు.. మూడు వారాల్లో భారీగా పెరిగిపోయిన వెండి ధరల్నిచూసి.. అప్పటికప్పుడు అప్పులు తీసుకొచ్చి.. ఇంట్లో ఉన్న బంగారాన్నితాకట్టు పెట్టి కొనుగోలు చేసినోళ్లకు శుక్రవారం(జనవరి 30) దిమ్మ తిరిగే షాకిచ్చింది. రోజు వ్యవధిలో కేజీ వెండి ధర దాదాపు రూ.67 వేలు పడిపోయింది. దీంతో.. వెండి మీద నమ్మకం పెట్టుకున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురైన పరిస్థితి.
వెండి ధర జీవితకాల గరిష్ఠానికి చేరుకోవటంతో భారీ ప్రాఫిట్ బుకింగ్ కు దిగటంతో వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. తదుపరి ఫెడ్ చీఫ్ గా ఆ విభాగం మాజీ అధికారి కెవిన్ వార్ష్ ను నియమిస్తారని.. ఆయన నియామకంతో కఠిన మానిటరీ పాలసీని అనుసరిస్తారని.. డాలర్ విలువను బలోపేతం చేస్తారన్న అంచనా వెండి ధర మీద ప్రభావాన్ని చూపించింది. దీనికి తోడు ట్రంప్ సైతం కెవిన్ వార్ష్ ను తదుపరి ఫెడ్ చీఫ్ గా ప్రకటించటం వెండి మహా పతనానికి కారణంగా పేర్కొంటున్నారు. బంగారం ధరలు కూడా తగ్గటం తెలిసిందే.