కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ 2026-27 ఆంధ్రప్రదేశ్‌కు ఒక సరికొత్త ఆశను చిగురింపజేసింది. `యువశక్తి బడ్జెట్` పేరుతో ఆదివారం ప్రవేశపెట్టిన ఈ పద్దులో ఏపీకి సంబంధించి అత్యంత కీలకమైన అంశం—`రేర్ ఎర్త్స్ కారిడార్`. విలువైన ఖనిజాల తవ్వకాల కోసం ఈ పథకం చేపట్టనున్నట్టు నిర్మలమ్మ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, కేరళ, మరియు తమిళనాడు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత కోసం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కారిడార్ల ద్వారా కేవలం ఖనిజాలను తవ్వడమే కాకుండా... వాటి ప్రాసెసింగ్, పరిశోధన, మరియు తుది ఉత్పత్తుల తయారీని కూడా ఆయా రాష్ట్రాల్లోనే ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ రేర్ ఎర్త్స్ పథకం నవంబర్ 2025లోనే ప్రారంభమైందని, ఇప్పుడు దానికి బడ్జెట్ పరంగా పూర్తి స్థాయి మద్దతును మరియు కారిడార్ల రూపంలో వ్యూహాత్మక వెన్నుదన్నును అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని తీర ప్రాంత రాష్ట్రాల్లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని వినియోగించుకోవడం ద్వారా ఆ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని కేంద్రం నిర్ణయించిందని నిర్మలమ్మ స్పష్టం చేశారు.
ఏపీకి కలిగే ప్రయోజనాలేమిటి?
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం కేవలం పర్యాటకానికి మాత్రమే కాదు, అరుదైన ఖనిజ సంపదకు కూడా నిలయం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న ఇసుక తిన్నెల్లో మోనజైట్, రుట్లై, జిరోకాన్, గార్నెట్, ఇల్మెనైట్ వంటి వ్యూహాత్మక మూలకాలు అపారంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా `మోనజైట్` ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ అరుదైన ఖనిజాలు రేపటి కాలంలో ప్రపంచాన్ని శాసించబోయే స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, విమానాలు, రక్షణ రంగ పరికరాల తయారీలో ఇవి ప్రాణవాయువు లాంటివి.
కేంద్రం ప్రకటించిన తాజా పథకం ద్వారా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతంలో ఖనిజాల వెలికితీత, శుద్ధి మరియు పరిశోధనల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కేవలం తవ్వకాలే కాకుండా, వాటిని శుద్ధి చేసే ఫ్యాక్టరీలు ఏపీలో రావడం వల్ల వేల సంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం వంటి నగరాలు ఇండస్ట్రియల్ హబ్‌లుగా మారి భారీగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రంగంలో చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉంది. భారత్ తన సొంత కారిడార్‌ను ఏపీలో నిర్మిస్తే, ప్రపంచ టెక్నాలజీ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగుతుంది. మొత్తానికి, కేంద్రం ఇచ్చిన ఈ బూస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద వరమనే చెప్పాలి. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పనులు మొదలైతే ఏపీ దశ మారుతుందనడంలో సందేహం లేదు.