తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. వీటిలో చిత్రంగా.. చిన్నా చితకా పార్టీలే ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేశారు. మొత్తంగా 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీలు కూడా.. రంగంలో తమ వారిని బరిలో దింపాయి. ఇక, ఇప్పుడు ప్రచారమే మిగిలింది.
అయితే.. ఈ మొత్తం ఘట్టంలో కీలకమైన ప్రచారానికి శనివారం నుంచి నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రులకు జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. ప్రతి మంత్రి కీ టార్గెట్ కూడా విధించింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్.. ఎట్టి పరిస్థితిలోనూ 70 శాతం మేరకు మునిసిపాలిటీలు, 80 శాతం మేరకు కార్పొరేషన్లలో విజయం దక్కించుకునేందుకు లక్ష్యంగా నిర్దేశించుకుంది.
కీలకం ఇదే..
పార్టీ ఏదైనా.. గెలుపు మంత్రంతోనే ముందుకు సాగుతున్నాయి. అయితే.. ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ ఎస్, బీజేపీలు ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అధికార పక్షం తాము చేసిన అభివృద్ధితోపాటు..గత బీఆర్ ఎస్ పార్టీ వైఫల్యాలను, అవినీతిని ప్రజల మధ్యకు తీసుకురావడం ద్వారా.. ఆ పార్టీకి సెంటిమెంటు రాకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
మరోవైపు.. బీజేపీ సహా చిన్న పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దరిమిలా.. ప్రభు త్వాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. ప్రచారానికి కేవలం 10 రోజులు మాత్రమే ఉండడం.. పరిధి మాత్రం విస్తారంగా ఉండడంతో అన్ని పార్టీలూ.. కీలక నాయకులతో పాటు, క్షేత్రస్థాయి నాయకులను కూడా అలెర్ట్ చేయడం విశేషం. ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల విజయం ఇటు కాంగ్రెస్‌కు, అటు బీఆర్ ఎస్‌కు కూడా కీలకంగా మారింది.