బడ్జెట్ 2026: టాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!

admin
Published by Admin — February 01, 2026 in National
News Image

సామాన్య పన్ను చెల్లింపుదారుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌లో సంచలన ప్రకటకనలు చేశారు. కేవలం కార్పొరేట్ దిగ్గజాలకే కాకుండా, సామాన్య మధ్యతరగతి ప్రజలకు సైతం ఊరటనిచ్చేలా నూతన ఆదాయపు పన్ను చట్టాన్ని పట్టాలెక్కించారు. రానున్న ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టం, పన్ను చెల్లింపు ప్రక్రియను సమూలంగా మార్చివేయబోతోంది.

సరళంగా ఐటీ రిటర్న్స్.. ఇక ఫారాల తిప్పలు ఉండవు!
పన్ను కట్టడం కంటే, ఆ ఫారాలు నింపడమే పెద్ద తలనొప్పిగా భావించే సామాన్యుల కోసం ఆర్థిక మంత్రి కీలక హామీ ఇచ్చారు. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌ను అత్యంత సరళతరం చేస్తూ కొత్త ఫారాలను ప్రవేశపెట్టనున్నారు. సామాన్యులు కూడా ఎవరి సాయం లేకుండా సొంతంగా ఫైల్ చేసుకునేలా ఈ మార్పులు ఉండబోతున్నాయి. అంతేకాకుండా, సవరించిన రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి ఏకంగా మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరటనిచ్చింది.

విదేశీ విద్య, వైద్యంపై భారీగా తగ్గిన భారం
విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు, వైద్యం కోసం వెళ్లే వారికి ఈ బడ్జెట్ తీపి కబురు అందించింది. విదేశీ యాత్రలపై పన్ను తగ్గించడమే కాకుండా, విద్య మరియు వైద్య అవసరాల కోసం చేసే ఖర్చులపై టీడీఎస్ ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద వెసులుబాటు కలిగించనుంది. మరోవైపు, రహదారి ప్రమాదాల పరిహారంపై వచ్చే వడ్డీకి పన్నును పూర్తిగా తొలగించడం ద్వారా బాధితుల పట్ల కేంద్రం సానుకూలత ప్రదర్శించింది.

జైలు భయం వద్దు.. జరిమానా కడితే చాలు!
పన్ను వివాదాల్లో చిక్కుకున్న వారికి ఊరటనిస్తూ క్రిమినల్ చర్యల తీవ్రతను ప్రభుత్వం తగ్గించింది. గతంలో ఉన్న కఠినమైన జైలు శిక్షలను రెండేళ్లకు పరిమితం చేస్తూ, ఒకవేళ జరిమానా చెల్లిస్తే ఆ శిక్ష నుంచి కూడా మినహాయింపు లభించేలా చట్టాన్ని సవరించారు.

బైబ్యాక్‌లకు షాక్.. విదేశీ ఆస్తులపై కఠినం
ఒకవైపు సామాన్యులకు రాయితీలు ఇస్తూనే, మరోవైపు కార్పొరేట్ కంపెనీలకు నిర్మలమ్మ షాక్ ఇచ్చారు. కంపెనీల బైబ్యాక్ కొనుగోళ్లపై 2 శాతం, నాన్-కార్పొరేట్ బైబ్యాక్‌లపై ఏకంగా 30 శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, విదేశాల్లో ఆస్తులు ఉన్నవారు ఇకపై వాటి వివరాలను వెల్లడించడం తప్పనిసరి చేస్తూ నిబంధనలను కఠినతరం చేశారు. పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

Tags
Budget 2026 Income Tax Nirmala Sitharaman Tax Relief Indian Economy New Tax Rules
Recent Comments
Leave a Comment

Related News