మేయ‌ర్ సీటుపై మోజు.. ఒక్క రాత్రిలో రూ. 8 కోట్లు ప‌న్ను క‌ట్టిన‌ నేత!

admin
Published by Admin — February 01, 2026 in Politics, Telangana
News Image

నిజామాబాద్: రాజకీయాల్లో గెలవాలనే పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైనా అధిగమించవచ్చు అంటారు. కానీ, నిజామాబాద్‌లో జరిగిన ఈ తాజా సంఘటన చూస్తుంటే.. రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతటి భారీ మొత్తాన్నైనా వెచ్చించడానికి నేతలు వెనకాడరని అర్థమవుతోంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలు, ఒక్క ఎన్నికల నోటిఫికేషన్‌తో మున్సిపల్ ఖజానాకు చేరడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

నిజామాబాద్ కాంగ్రెస్ నాయకుడు శమంత నరేందర్ రెడ్డి భార్య ఈసారి మేయర్ రేసులో ఉన్నారు. అయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం పోటీ చేసే అభ్యర్థులు ఎటువంటి ప్రభుత్వ బకాయిలు ఉండకూడదు. అయితే నరేందర్ రెడ్డికి చెందిన ఒక ప్రముఖ హోటల్‌కు సంబంధించి 2009 నుండి అంటే దాదాపు 17 ఏళ్లుగా ఆస్తి పన్ను పెండింగ్‌లో ఉంది. దీని విలువ అక్షరాలా రూ. 8,16,65,000. ఇన్నాళ్లుగా మున్సిపల్ నోటీసులను లెక్కచేయని పరిస్థితి ఉన్నా, పదవి ముంగిట మాత్రం నిబంధనలకు తలవంచక తప్పలేదు.

తొలుత ఈ బకాయిల నుంచి మినహాయింపు పొందాలని లేదా గడువు పెంచుకోవాలని నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘంగా, అర్ధరాత్రి 12 గంటల వరకు సాగిన వాదనల అనంతరం న్యాయస్థానం ``చట్టం ముందు అందరూ సమానమే.. పన్ను చెల్లించాల్సిందే`` అని స్పష్టం చేస్తూ ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. చేసేదేమి లేక కోర్టు తీర్పు వెలువడిన వెంటనే, నరేందర్ రెడ్డి ఆరు భారీ డిమాండ్ డ్రాఫ్టుల రూపంలో రూ. 8.16 కోట్లను మున్సిపల్ అధికారులకు సమర్పించారు. నిజామాబాద్ కార్పొరేషన్ చరిత్రలో ఒక వ్యక్తి నుండి ఇంత భారీ మొత్తం పన్ను రూపంలో రావడం ఇదే తొలిసారి. ఎన్నికల పుణ్యమా అని మొండి బకాయిలు వసూలు కావడంతో అధికారులు సంబరపడుతుంటే, సామాన్య ప్రజలు మాత్రం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Tags
Nizamabad Telangana Politics Nizamabad Municipal Corporation Congress Mayor Election
Recent Comments
Leave a Comment

Related News