చిరు మనవడు వచ్చాడు.. కానీ ఈ రగడ అవసరమా?

admin
Published by Admin — February 01, 2026 in Movies
News Image

మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఎన్నో విజయాలు చూశారు, ఎన్నో అవార్డులు అందుకున్నారు. కానీ, వ్యక్తిగతంగా ఆయన మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఒక చిన్న కోరిక.. ఒక మనవడు పుట్టాలని. సుష్మిత, శ్రీజ, రామ్ చరణ్.. ఇలా ఇంట్లో అందరికీ ఆడపిల్లలే పుట్టడంతో, మెగా వారసుడి కోసం ఆయన ఆశగా ఎదురుచూస్తున్నట్లు గతంలో బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు కవల పిల్లలకు (ఒక బాబు, ఒక పాప) జన్మనివ్వడంతో చిరు కోరిక నెరవేరింది. మెగా సామ్రాజ్యంలో ఇప్పుడు వారసుడి రాకతో సంబరాలు మిన్నంటాయి.

మెగా కుటుంబంలో జరిగే వేడుక అంటే అది కేవలం ఆ కుటుంబానికే పరిమితం కాదు, కోట్లాది మంది అభిమానులకు కూడా పండగే. అయితే, ఈ ఆనందం కాస్తా అతిగా మారి ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఉపాసన డెలివరీ జరిగిన అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో అభిమానులు భారీ ఎత్తున బాణసంచా కాల్చడంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రి అంటే నిశ్శబ్దం ఉండాల్సిన చోటు. అక్కడ పసిపిల్లల నుంచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల వరకు ఎందరో ఉంటారు. బాణసంచా శబ్దాలు, పొగ వారిని ఎంత ఇబ్బంది పెడతాయనే ఇంగిత జ్ఞానం అభిమానుల్లో లోపించడం విచారకరం.

సాధారణంగా ఇలాంటి పెద్ద స్టార్ల విషయాల్లో అభిమానులను కంట్రోల్ చేయాల్సింది వారి పీఆర్ టీమ్స్. కానీ, ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. పీఆర్ టీమ్ స్వయంగా ముందుండి ఈ వేడుకలను నడిపించడంపై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో హైప్ కోసం, పబ్లిసిటీ కోసం ఆసుపత్రి నిబంధనలను, రోగుల సౌకర్యాన్ని పక్కన పెట్టేయడం ఎంతవరకు సమంజసం? రామ్ చరణ్ తన కూతురు క్లిన్ కారతో ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా అభిమానుల తోపులాట చూసి అసహనం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలు ఎంత కంట్రోల్ చేయాలని చూస్తున్నా, తెర వెనుక జరుగుతున్న ఇలాంటి ప్లాన్డ్ హంగామా వారి ప్రతిష్టను మసకబారుస్తోంది. చిరంజీవి గారికి మనవడు పుట్టడం నిజంగా మెగా అభిమానులకు పెద్ద పండగే. కానీ, ఒకరి సంతోషం మరొకరికి ఇబ్బంది కలిగించినప్పుడు ఆ వేడుకకు అర్థం ఉండదు అన్న‌ది వాస్తవం.

Tags
Ram Charan Upasana Konidela Chiranjeevi Mega Twins Mega Family Mega Fans
Recent Comments
Leave a Comment

Related News