బరేలీ: తొమ్మిదేళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం.. ఇరువైపులా పెద్దలను ఒప్పించి చేసుకున్న పెళ్లి.. మూడు ముళ్లతో ఒక్కటైన ఆ బంధం కనీసం మూడు నెలలు కూడా నిలవలేదు. ప్రాణంగా ప్రేమించిన భర్తను, తన చేతులతోనే గొంతు నులిమి చంపేసింది ఓ భార్య. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో వెలుగుచూసిన ఈ ఘోరం సంచలనం రేపుతోంది. అసలు వీరి మధ్య ఏం జరిగింది? అంతలా కక్ష పెంచుకోవడానికి కారణమేంటి? అనే వివరాలు తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
జితేంద్ర అనే యువకుడు ఐవీఆర్ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తుండగా, జ్యోతి అనే యువతి రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్‌గా పనిచేస్తోంది. వీరిద్దరూ గత తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు, రెండు నెలల క్రితమే ఘనంగా వివాహం జరిపించారు. అందరూ ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉన్నారని అనుకున్నారు. కానీ, ఆ ఇంట్లో ఆన్‌లైన్ జూదం అనే మహమ్మారి చిచ్చు పెడుతుందని ఎవరూ ఊహించలేదు.
రూ. 20 వేల చిచ్చు.. ఆపై ఘోరం!
జితేంద్రకు ఆన్‌లైన్ గేమింగ్ అలవాటు ఉంది. ఈ క్రమంలో తన భార్య జ్యోతి బ్యాంకు ఖాతా నుంచి ఆమెకు తెలియకుండా రూ. 20,000 డ్రా చేసి గేమింగ్‌లో పోగొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న జ్యోతి ఆగ్రహంతో ఊగిపోయింది. జనవరి 26న ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. కేవలం మాటలతో ముగిసిపోవాల్సిన గొడవ, జ్యోతి మనసులో కిరాతక ఆలోచనకు దారితీసింది. తన భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె, వెంటనే తన పుట్టింటి వారికి ఫోన్ చేసి పిలిపించింది.
జ్యోతి పిలుపుతో ఆమె తండ్రి కాళీచరణ్, తల్లి చమేలీ, సోదరుడు దీపక్ జితేంద్ర ఇంటికి చేరుకున్నారు. అందరూ కలిసి జితేంద్రపై దాడి చేశారు. తల్లిదండ్రులు, సోదరుడు కలిసి జితేంద్ర కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా అదిమి పట్టుకోగా.. జ్యోతి స్వయంగా తన భర్త గొంతు నులిమి ప్రాణాలు తీసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగా, ఇది ఆత్మహత్య అని నమ్మించేందుకు మృతదేహాన్ని మఫ్లర్‌తో కిటికీ గ్రిల్‌కు వేలాడదీశారు.
జితేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని జ్యోతి ఇరుగుపొరుగు వారికి చెప్పింది. అయితే, తన తమ్ముడు అంత పిరికివాడు కాదని, అతని మరణంపై అనుమానం ఉందని జితేంద్ర సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపగా అసలు నిజం బయటపడింది. అది ఉరి వేసుకోవడం వల్ల వచ్చిన మరణం కాదని, గొంతు నులమడం వల్ల జరిగిన హత్య అని తేలింది. పోలీసుల శైలిలో విచారించగా, జ్యోతి తన నేరాన్ని అంగీకరించింది. ప్రస్తుతం జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ఆమె సోదరుడి కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి.