ఏపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే. కానీ, అవి హద్దులు దాటినప్పుడు వచ్చే పరిణామాలు ఎంత భీభత్సంగా ఉంటాయో తాజాగా ఇబ్రహీంపట్నం సాక్షిగా కనిపిస్తోంది. మాజీ మంత్రి జోగి రమేశ్ నోటి దురద, దానికి ప్రతిగా టీడీపీ శ్రేణుల దాడులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇంత రభస జరుగుతున్నా, తన ఇంటిపై దాడులు జరుగుతున్నా జోగి రమేశ్ తీరులో మాత్రం ఏ మార్పు రాకపోవడం గమనార్హం.
మంత్రి నారా లోకేశ్‌ను, సీఎం చంద్రబాబును ఉద్దేశించి అత్యంత దారుణమైన పదజాలంతో జోగి రమేశ్ విమర్శలు గుప్పించారు. వాడు వీడు అంటూ సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. తీరా ఆ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపైకి వెళ్లడం, రాళ్లు రువ్వడం, ఉద్రిక్తత చోటుచేసుకోవడం వంటి పరిణామాలు చూశాకైనా ఆయన కాస్త వెనక్కి తగ్గారా అంటే అదీ లేదు. సీన్ కట్ చేస్తే.. జోగి రమేశ్ మళ్ళీ పాత రాగం అందుకున్నారు. పైగా తానేం తప్పు మాట్లాడాను? అంటూ అమాయకంగా ప్రశ్నించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఎవరూ సమర్థించలేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ, ఆ ఘటన తర్వాత జోగి రమేశ్ స్పందించిన తీరు మరీ విచిత్రంగా ఉంది. ``లోకేష్.. నీ వెర్రి చేష్టలకు నేను భయపడను…నీ అయ్య, నువ్వు, నన్ను జైల్లో పెట్టి రాక్షసానందం పొందింది చాలక.. ఇప్పుడు నా ఇంటి మీద పెట్రోల్ బాంబుతో దాడి చేస్తారా? సిగ్గు, శరం వదిలేసి సన్నాసుల్లాగ తయారయ్యారు.. ఏం పనులురా ఇవి, పనికి మాలినోడా..`` అంటూ రెచ్చిపోయారు. అక్కడితో ఆగకుండా ``మీ ఇల్లు ఎంత దూరమో.. మా ఇల్లు కూడా అంతే దూరం. పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టిస్తా`` అంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
రాజకీయాల్లో విమర్శ ఉండాలి కానీ అది వైషమ్యంగా మారకూడదు. పదజాలం ఎంత సభ్యతగా ఉంటే, గౌరవం అంత పెరుగుతుంది. కానీ జోగి రమేశ్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా ఆయనపై తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కేసు నమోదైంది. చంద్రబాబు, లోకేశ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, మీడియా సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో నిన్నటి ఘర్షణతో ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రతను పెంచారు.