భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, బంగ్లాకు మద్దతుగా తాము కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పాకిస్థాన్ చెప్పింది. ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్న పాక్ టోర్నీలో ఆడతామని ప్రకటించి నవ్వులపాలైంది. ఇక, తాజాగా భారత్ తో మ్యాచ్ ను పాక్ బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై స్పందించిన ఐసీసీ...పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చింది.
టీ20 ప్రపంచ కప్ లో తాము ఆడతామా లేదా అన్న విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయిస్తుందని పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వీ గతంలోనే ప్రకటించారు. ప్రపంచక్‌పలో పాక్ జట్టు ఆడేందుకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్ అనుమతిస్తోందని, కానీ ఈ నెల 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆడాదని పాక్ ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, భారత్‌తో మ్యాచ్ నిరాకరించడానికి గత కారణాలను రెండ్రోజుల్లో నక్వీ వెల్లడిస్తారని తెలిపింది.
అయితే, ఈ వ్యవహారంపై ఐసీసీ స్పందించింది. భారత్ తో మ్యాచ్ అడడం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ నుంచి తమకు అధికారికంగా సమాచారం అందలేదని ఐసీపీ చెబుతోంది. క్రికెట్ ప్రపంచంలో అన్ని దేశాలు పరస్పర గౌరవం, క్రీడాస్ఫూర్తికి కట్టుబడి ఉండాలని ఐసీసీ హితవు పలికింది. దీర్ఘకాల పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తమ నిర్ణయంపై పునరాలోలించుకోవాలని పీసీబీని కోరింది. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించడం క్రీడా పవిత్రతను దెబ్బతీస్తుందని హితవు పలికింది. ఒకవేళ భారత్ తో పాక్ ఆడకుంటే తీవ్రమైన పరిణామలు ఎదుర్కోవలసి వస్తుందని పాక్ కు ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది.