తెలుగుదేశం పార్టీలో ఇకపై పైరవీలకు తావులేదని, కేవలం కష్టపడి పనిచేసే వారికే పదవులు వరిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన సంకేతాలిచ్చారు. కుప్పం పర్యటనలో భాగంగా కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ``పదవుల కోసం ఎవరి రికమెండేషన్లు అక్కర్లేదు.. మీ పనితీరు బాగుంటే పదవులే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి`` అంటూ బాబు చేసిన కామెంట్స్ సామాన్య కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి ఉదాహరణను సీఎం ప్రస్తావించారు. నిన్నటి వరకు ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న షణ్ముఖ రెడ్డి, నేడు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్నారంటే అది ఆయన నిబద్ధతకు దక్కిన గౌరవమని బాబు పేర్కొన్నారు. జెండా మోసే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటానని, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించే వారిని గుర్తించి వారికే బాధ్యతలు అప్పగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మారకుంటే `నమస్కారం`.. నేతలకు సీరియస్ వార్నింగ్!
కేవలం ప్రోత్సాహకాలే కాదు, పనితీరు సరిగా లేని నేతలకు బాబు గట్టి హెచ్చరికలే జారీ చేశారు. ``నేను నిర్మొహమాటంగా మాట్లాడతా.. వాస్తవాలే చెబుతా.. తప్పులుంటే సరిదిద్దుకోమని సూచిస్తా.. అప్పటికీ మారకపోతే మాత్రం నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా`` అని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతి వారం విశ్లేషణ జరుగుతోందని, టెక్నాలజీని ఉపయోగించి ఎప్పటికప్పుడు డేటాను సేకరిస్తున్నామని ఆయన వెల్లడించారు. అంటే, ఇకపై ప్రతి నాయకుడి గ్రాఫ్ నేరుగా అధినేత చేతుల్లోనే ఉండబోతోంది.
విజన్-2028: చరిత్ర తిరగరాసిన మెజార్టీ!
గత ఎన్నికల్లో కూటమికి లభించిన అఖండ మెజార్టీ గురించి ప్రస్తావిస్తూ.. వైసీపీ ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల భవిష్యత్తు కోసమే తన ఆలోచనలని, 2028 నాటికి తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తవుతుందని గుర్తుచేశారు. అభివృద్ధికి పునాది వేసింది.. వేసేది టీడీపీయేనని, విజన్-2020తో అది నిరూపితమైందని బాబు ధీమా వ్యక్తం చేశారు. మంత్రి లోకేశ్ `యువగళం` పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక గీతాన్ని విడుదల చేస్తూ.. పార్టీ యంత్రాంగం అంతా ఎన్నికల యుద్ధం తరహాలోనే నిరంతరం ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు.