ఒకప్పుడు పార్టీకి విధేయుడిగా, ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్.. ఈ మధ్య తన వ్యక్తిగత కారణాలతో వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీ నుండి సస్పెండ్ అయిన ఆయన తీరు మారలేదు. తాజాగా మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైల క్షేత్రంలో దివ్వెల మాధురితో కలిసి ఆయన చేసిన హల్చల్ చూస్తుంటే, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్‌ను సైతం ఆయన ఏమాత్రం పట్టించుకోనట్లే కనిపిస్తోంది.
ఇటీవల అసెంబ్లీ లాబీలో జగన్మోహన్ రెడ్డికి ఎదురుపడిన సమయంలో దువ్వాడకు గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం. ``ఏమిటి ఈ ఓవర్ యాక్షన్? నిన్నేమైనా సినిమా హీరో అనుకుంటున్నావా? ఫ్యామిలీ రచ్చ రోడ్డు మీదకు ఎందుకు తెస్తున్నావు?`` అని జగన్ సూటిగా చివాట్లు పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఆ సమయంలో దువ్వాడ వినయంగా తలవూపి, ``అన్నా.. అన్నీ సరిచేసుకుంటాను, మిమ్మల్ని త్వరలోనే ప్రత్యేకంగా కలుస్తాను``అని చెప్పి అక్కడి నుండి బయటపడ్డారు. కానీ, ఆ మాటలు కేవలం ఆ క్షణం వరకే పరిమితమయ్యాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి.
జగన్ క్లాస్ పీకిన కొద్దిరోజులకే దువ్వాడ తన మాస్ అవతారాన్ని మళ్ళీ బయటపెట్టారు. శివరాత్రి వేళ శ్రీశైల పుణ్యక్షేత్రంలో దివ్వెల మాధురితో కలిసి ఆయన ప్రత్యక్షమయ్యారు. అక్కడ దేవుడి దర్శనం కంటే, వీరిద్దరి చుట్టూ ఉన్న కెమెరాల హడావిడే ఎక్కువగా కనిపించింది. మీడియా ప్రతినిధులు, ఇన్ ఫ్లుయెన్సర్లు వీరి వెంటే పడి ఫోటోలు, వీడియోలు తీస్తుంటే.. దువ్వాడ ఏమాత్రం తగ్గకుండా సెలిబ్రిటీ రేంజ్లో ఫోజులిచ్చారు. అటు సోషల్ మీడియాలో రీల్స్ భజన కూడా ఆపలేదు.
పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు పడిన తర్వాత, మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావాలంటే పద్ధతి మార్చుకోవాలని అధిష్టానం సంకేతాలిచ్చింది. కానీ దువ్వాడ మాత్రం తన పర్సనల్ లైఫ్, సోషల్ మీడియా రీల్స్ విషయంలో వెనక్కి తగ్గకుండా పదే పదే సేమ్ సీన్‌ను రిపీట్ చేస్తున్నారు. జగన్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే నేత ముందే లైట్ తీసుకుంటున్నారంటే.. ఇక వైసీపీలో దువ్వాడ అధ్యాయం ముగిసినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.