టెక్కీ టు మూవీ స్టార్.. మానస వారణాసి అసలు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?

admin
Published by Admin — February 16, 2026 in Movies
News Image

గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే తారల వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉంటాయి. కొంతమంది వారసత్వంతో వస్తే, మరికొంతమంది తమ కష్టంతో పైకి వస్తారు. కానీ, చేతిలో మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, ల‌క్ష‌లు సంపాదించే ఒక అమ్మాయి.. అనుకోకుండా అందాల పోటీల వైపు అడుగులేసి, `మిస్ ఇండియా` కిరీటాన్ని కైవసం చేసుకుని, ఇప్పుడు వెండితెరపై మెరుస్తోంది. ఆమే మానస వారణాసి. అసలు ఈ టెక్కీ టాప్ మోడల్ గా ఎలా మారిందో..? ఆమె అసలు బ్యాక్‌గ్రౌండ్ ఏంటో..? తెలుసుకుందాం ప‌దండి.

హైదరాబాద్‌కు చెందిన రవిశంకర్, శైలజ దంప‌త‌లకు జ‌న్మించింది మానస వారణాసి. చదువులో ఎప్పుడూ టాపర్‌గా ఉండే మానస, గాలిలో మేడలు కట్టకుండా కెరీర్‌పై స్పష్టమైన అవగాహనతో ఉండేది. తండ్రి ఉద్యోగం కారణంగా చిన్న వయసులోనే మలేషియాకు వెళ్లిన మాన‌స‌.. అక్క‌డే త‌న స్కూలింగ్ ను కంప్లీట్ చేసింది. ఆ త‌ర్వాత ఇండియాకు తిరిగి వచ్చి, ఇంటర్మీడియట్, ఆపై హైదరాబాద్‌లోని వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసి `ఫ్యాక్ట్‌సెట్‌` అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంప్యూటర్ కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా ఉద్యోగంలో చేరింది. రోజువారీ ఆఫీస్ పనులు, డేటా ఎనాలసిస్, కోడింగ్.. ఇలా సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఒక చిన్న ఆలోచన పెద్ద మలుపుగా మారింది.

ఉద్యోగం చేస్తూనే సరదాగా ఫెమినా మిస్ ఇండియా పోటీలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారామె. అది లాక్‌డౌన్ సమయం కావడంతో అంతా ఆన్‌లైన్‌లోనే జరిగేది. గంటల కొద్దీ ల్యాప్‌టాప్ ముందు కూర్చుని మానస ఏవో ఫామ్స్ నింపడం, ఎవరితోనో మాట్లాడటం చూసి ఆమె తల్లి కంగారు పడ్డారట. ఏకంగా తన కూతురు ఏదో `ఆన్‌లైన్ లవ్ మాఫియా` ఉచ్చులో పడిపోయిందని ఆమె భయపడ్డారు. కానీ, అది మిస్ ఇండియా పోటీల ఆడిషన్స్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.

కిరీటం దాకా.. కఠిన శ్రమ
మొదట్లో సరదాగా మొదలుపెట్టినా, పోటీ పెరిగేకొద్దీ మానస తనను తాను మలుచుకుంది. అసలు అప్పటిదాకా హీల్స్ వేసుకుని నడవడం కూడా తెలియని ఈ టెక్కీ, మిస్ ఇండియా వేదికపై క్యాట్‌వాక్ చేసే స్థాయికి ఎదిగింది. ఫలితంగా 2020లో `ఫెమినా మిస్ ఇండియా` కిరీటాన్ని అందుకుని దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ పోటీల్లోనూ టాప్ 13లో నిలిచి భారత్ తరపున గర్వంగా నిలబడింది.

మానస కేవలం అందాల పోటీలకే పరిమితం కాలేదు. తన ప‌ద‌విని ఉపయోగించి సమాజానికి ఏదైనా చేయాలని సంకల్పించింది. అందుకే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి `చైల్డ్ హెల్ప్‌లైన్ 1098` గురించి అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించింది. చిన్నపిల్లల రక్షణ కోసం ప‌లు ప్రాజెక్టులు చేపట్టి, `బ్యూటీ విత్ ఏ పర్పస్` అంటే కేవలం మాటలు కాదు, చేతలు అని నిరూపించింది.

ఇప్పుడు వెండితెరపై `సత్యభామ`గా..
మోడలింగ్‌లో రాణించిన తర్వాత సహజంగానే సినిమా అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. `దేవకీ నందన వాసుదేవ` సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన నటనతో మెప్పించిన మాన‌స‌.. రీసెంట్ గా `కపుల్ ఫ్రెండ్లీ`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హాయ్ చెప్పింది. ప్రేమికుల రోజు సందర్భంగా శనివారం థియేటర్లోకి వ‌చ్చిన ఈ మూవీ సరికొత్త లవ్‌ స్టోరీగా, స్వచ్ఛమైన రొమాంటిక్‌ డ్రామాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరో సంతోష్ శోభ‌న్‌, మ‌న‌స‌ల యాక్టింగ్ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా మారింది. క‌పుల్ ఫ్రెండ్లీ ద్వారా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిన మాన‌స‌.. భవిష్యత్తులో 100 కోట్ల క్లబ్ సినిమాల్లో నటించడమే తన లక్ష్యమని ధీమాగా చెబోతంది. ఏదేమైనా ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి గ్లామర్ వరల్డ్ సెన్సేషన్‌గా మారిన మానస ప్రయాణం నిజంగా ఎందరో యువతులకు స్ఫూర్తిదాయకం.

Tags
Manasa Varanasi Miss India 2020 Couple Friendly Tollywood Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News