అమరావతి: కాలం వెనక్కి వెళ్ళిందా? లేక చరిత్ర పునరావృతమవుతోందా? సరిగ్గా 29 ఏళ్ల క్రితం.. 1997లో ఒక యువ ముఖ్యమంత్రి, ఒక టెక్ దిగ్గజాన్ని కలిసి ``హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మారుస్తా`` అని విజన్ వివరించారు. ఆ భేటీ ఫలితమే నేటి హైటెక్ సిటీ. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యింది. అమరావతి వేదికగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
1997లో బిల్ గేట్స్‌తో జరిగిన ఆ మొదటి భేటీ కేవలం ఒక పరిచయం మాత్రమే కాదు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చిన క్షణం. ఇప్పుడు 2026లో, `స్వర్ణాంధ్ర 2047` లక్ష్యంతో చంద్రబాబు మళ్ళీ గేట్స్‌తో చేతులు కలిపారు. కేవలం ఐటీ మాత్రమే కాదు, ఈసారి హెల్త్ కేర్, అగ్రికల్చర్, మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశం చూస్తుంటే, రాష్ట్రానికి మళ్ళీ గోల్డెన్ డేస్ మొదలయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిల్ గేట్స్ వంటి ప్రపంచ స్థాయి దాతృత్వవేత్త, విజనరీ మద్దతు ఉంటే ఏపీ మళ్ళీ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారడం ఖాయమని అంటున్నారు.
బిల్ గేట్స్ తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చేసిన భావోద్వేగపూరిత ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ``1997లో నేను మొదటిసారి బిల్ గేట్స్ గారిని కలిసినప్పుడు, ఐటీ రంగంపై నాకున్న విజన్‌ను ఆయనకు వివరించాను. ఆనాడు ఒక టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను నిర్మించడంపై మా మధ్య మొదలైన సంభాషణ, నేడు పాలనలో వినూత్న మార్పులు తీసుకురావడం మరియు ప్రజల జీవితాలను మెరుగుపరచడం అనే ఒక విస్తృత లక్ష్యంగా రూపాంతరం చెందింది.
ఈ రోజు అమరావతి సచివాలయంలో ఆయనను కలిసి, నా `స్వర్ణాంధ్ర 2047` విజన్‌ను ఆయన ముందు ఉంచాను. ఈ సందర్భంగా మా మంత్రులు, కార్యదర్శులు కూడా ఆయనతో ముచ్చటించారు. మా ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాల గురించి చర్చించడంతో పాటు, ప్రజలకు సాధికారత కల్పించి వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ఏ విధంగా ముందుకు సాగవచ్చనే అంశాలను అన్వేషించాము.`` అంటూ చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.