జేడీ లక్ష్మీనారాయణగా రెండు తెలుగు రాష్ట్రాలకూ పరిచితులైన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆయన వైదొలిగారు. ఈ క్రమంలోనే ప్రఖ్యాత ఇంజనీరింగ్ కంపెనీ .. మేఘా గ్రూప్ సంస్థ అనుబంధ విభాగం.. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన నియమితులయ్యారు.
ప్రాథమిక సమాచారం మేరకు... నెలకు 4 లక్షల రూపాయల వరకు వేతనం, ఇతర భత్యాలు, కారు, ఇద్దరు డ్రైవర్లు, నలుగురు వ్యక్తిగత సిబ్బందిని జేడీకి.. సదరు కంపెనీ సమకూర్చనుంది. ఈయన దేశవ్యాప్తంగా ఉన్న ఈవీ ట్రాన్స్ కు చెందిన కార్యాలయాలకు వెళ్లి.. ఆపరేషన్స్ విభాగాల పనితీరును ఆయన మెరుగు పరచనున్నారు. ఈ సంస్థ ప్రస్తుతం 900లకు పైగా బస్సులను నిర్వహిస్తోంది. వీటి బాధ్యతలను ఇక నుంచి లక్ష్మీనారాయణ చూడనున్నారు. ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. మూడేళ్లపాటు ఆయన ఈ విధుల్లో ఉండనున్నారు.
రాజకీయాలకు దూరం..
2017కు ముందు.. రాజకీయాల్లోకి వచ్చిన జేడీ.. ఆ సమయంలోనే తన ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ సమయంలోనే ఆయన పవన్ కల్యాణ్ అభిరుచులు మెచ్చుకుని.. జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే.. ఆయన ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. తర్వాత.. జనసేనతో విబేధించి.. బయటకు వచ్చాక.. `జై భారత్ నేషనల్ పార్టీ`ని స్థాపించారు. 2024 ఎన్నికల్లో తన కుమార్తె సహా.. ఆయనతోపాటుపలువురు ఈ పార్టీపైనే పోటీ చేశారు. కానీ, ఎవరూ విజయం దక్కించుకోలేక పోయారు.
జగన్ కోసమేనా?
2024కు ముందు జేడీ సొంతగా పార్టీ పెట్టడం వెనుక వైసీపీ అధినేత జగన్ ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఎందుకంటే.. జేడీ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పైగా సమాజంలో మంచి పేరుంది. దీంతో అప్ప ట్లో జనసేనాని పవన్‌ను బలంగా ఎదుర్కొనే ప్రయత్నంలో.. జగన్.. జేడీని వాడుకున్నారన్న ప్రచారం జరిగింది. కాపుల్లో తటస్థులను పవన్‌కు దూరం చేయడం ద్వారా.. కూటమి పరాజయానికి జేడీని ఒక తురుపు ముక్కలా వాడుకునే ప్రయత్నం చేశారన్న వాదన ఉంది.
కానీ.. జగన్ ప్రయోగం.. జేడీ ప్రయత్నం రెండూ వీగిపోయాయి. దీంతో 2024 ఎన్నికల తర్వాత.. జేడీ పూర్తి గా సైలెంట్ అయ్యారు. వాస్తవానికి.. జేడీకి స్వయంగా రాజకీయాలపై ఇంట్రస్ట్ ఉంటే.. పార్టీ ఓడిపోయినా.. ఆయన ప్రజల మధ్యకు వచ్చేవారు. మేధావులను లేదా కాపు సామాజిక వర్గాన్ని కలుపుకొని వెళ్లి ఉండేవారు. కానీ.. ఆయన అలా చేయలేదు. సో.. ఆయన కేవలం జగన్ కోసం.. అప్పట్లో కాపుల ఓట్లు చీల్చడం కోసమే రాజకీయ పార్టీ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పుడు.. మేఘాలో చేరిపోవడంతో ఇది మరింత బలపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.