ఒక కథానాయకుడి సినిమాలు రెండు ఒకే వీకెండ్లో రావడం ఆ హీరోతో పాటు అందరికీ ఇబ్బంది కలిగించే విషయమే. గతంలో బాలకృష్ణ, నానిల కెరీర్లో ఇలాంటి తప్పనిసరి పరిస్థితులు వచ్చాయి. మళ్లీ శ్రీ విష్ణు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న సంకేతాలు కనిపించాయి.
ఈ నెల 27న మృత్యుంజయ్, 28న విష్ణు విన్యాసం రిలీజ్ కానున్నట్లు పోటాపోటీగా వాటి మేకర్స్ ప్రకటనలు ఇవ్వడంతో ప్రేక్షకుల్లో అయోమయం నెలకొంది. ఓటీటీ డీల్స్ దృష్ట్యా ఈ పరిస్థితి తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. శ్రీ విష్ణు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేని స్థితిలో ఉన్నట్లు కనిపించాడు. కానీ కొన్ని రోజుల్లోనే పరిస్థితి మారింది. ‘మృత్యుంజయ్’ సినిమా వాయిదా పడుతున్నట్లు శ్రీ విష్ణు కన్ఫమ్ చేశాడు. దీంతో 28కు ‘విష్ణు విన్యాసం’ కన్ఫమ్ అయింది.
ఐతే ‘మృత్యుంజయ్’ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తుంటే.. ఈ రోజు ప్రకటన వచ్చేసింది. మార్చి 6న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అంటే అనుకున్న దాని కంటే వారం లేటుగా ఈ సినిమా రాబోతోంది. ‘విష్ణు విన్యాసం’కు, దీనికి మధ్య ఆరు రోజుల విరామం ఉంది. ఇది కూడా కొంత ఇబ్బందే కానీ.. మరీ ఒక్క రోజు గ్యాప్‌లో రావడం కంటే ఇది బెటర్.
ఐతే ఈ రెండు చిత్రాలూ పూర్తి భిన్నమైనవి కావడం విష్ణుకు కొంత ఊరటనిచ్చే విషయం. ‘విష్ణు విన్యాసం’ తన మార్కు ఎంటర్టైనర్ కాగా.. ‘మృత్యుంజయ్’ తన శైలికి భిన్నమైన సీరియస్ థ్రిల్లర్. ‘విష్ణు విన్యాసం’ను యదునాథ్ మారుతిరావు అనే కొత్త దర్శకుడు రూపొందించగా.. ‘మృత్యుంజయ్’ను సుకుమార్ శిష్యుడు, ఇంతకుముందు ‘మీకు మీరే మాకు మేమే’ చిత్రాన్ని రూపొందించిన హుసేన్ షా కిరణ్ డైరెక్ట్ చేశాడు.