కవిత కొత్త పార్టీ పేరు లీక్.. నేడే అసలైన క్లైమాక్స్!

admin
Published by Admin — March 19, 2026 in Politics, Telangana
News Image

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపునకు రంగం సిద్ధమైందా? గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ వస్తున్న కల్వకుంట్ల కవిత, ఇప్పుడు సరికొత్త రాజకీయ అస్త్రంతో మైదానంలోకి దిగనున్నారా? అంటే అవును అన్న స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా `తెలంగాణ ప్రజా జాగృతి` అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీని నమోదు చేసే ప్రక్రియను క‌విత తెరపైకి తెచ్చారు. జనవరి 23నే కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) ఈ మేరకు దరఖాస్తు చేయగా, తాజాగా ఈ విషయం బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

ఈసీ అభ్యంతరాలు.. హైకోర్టులో పోరాటం!
పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం దరఖాస్తుతోనే ముగిసిపోలేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఎ ప్రకారం కవిత చేసిన దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఫిబ్రవరి 23నే ఆమెకు సమాచారం అందించినట్లు ఈసీ తరఫు న్యాయవాదులు వెల్లడించారు. అయితే, తన పార్టీ రిజిస్ట్రేషన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కవిత నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది.

గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా కవిత తరఫు ప్రధాన న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కేసు ఈరోజుకు (మార్చి 19) వాయిదా పడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ఢిల్లీ హైకోర్టు ఇచ్చే ఆదేశాలు కవిత రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానున్నాయి. ఈసీ వేలెత్తి చూపిన లోపాలను కవిత బృందం సరిచేస్తుందా? లేక కోర్టు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిస్తుందా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

కాగా, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా, కవిత సొంతంగా పార్టీ పెట్టి తన ఉనికిని చాటుకోవాలని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ‘జాగృతి’ అనే సంస్థ ద్వారా ఇప్పటికే ప్రజల్లో గుర్తింపు ఉన్న ఆమె, ఇప్పుడు అదే పేరును రాజకీయ శక్తిగా మార్చాలని నిర్ణయించుకోవడం విశేషం. ఈరోజు కోర్టు విచారణ తర్వాత ఈ కొత్త పార్టీ ప్రస్థానంపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Tags
K Kavitha Telangana Praja Jagruthi Telangana Politics Telangana Jagruthi Delhi High Court
Recent Comments
Leave a Comment

Related News