తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ ఒకప్పుడు ఏ స్థాయిలో ట్రోలింగ్‌కు గురయ్యాడో తెలిసిందే. తనకు మాట్లాడ్డం రాదని.. విషయ పరిజ్ఞానం తక్కువ అని.. రాజకీయాలకు పనికి రాడని ఒక ముద్ర వేసి.. తనను ‘పప్పు’ అంటూ సంబోధించేవారు. అదే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం దమ్మున్న నాయకుడని.. పులి అని ఎలివేషన్లు ఇచ్చేవాళ్లు. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ పరిస్థితి ఏమైందో అందరూ చూశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర మొదలైనప్పటి నుంచి జగన్ అంత అధ్వాన్నపు పాలన ఎవరూ చేయలేదనే పేరొచ్చింది. అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేని దౌర్భాగ్య స్థితిని జగన్ ఎదుర్కొన్నాడు. ఎప్పుడైనా పొరపాటున మీడియాను కలిసినా.. ఏదైనా సమావేశంలో మాట్లాడాలన్నా స్క్రిప్టు లేకుంటే జగన్ ఎంత ఇబ్బంది పడతాడో అందరూ చూశారు. అధికారం కోల్పోయాక జగన్ ప్రెస్ మీట్ పెడితే.. ఆ రోజు ట్రోలింగ్ ఒక రేంజిలో ఉంటోంది.
మరోవైపు లోకేష్ గత ఐదేళ్లలో ఎంతో మెరుగుపడ్డాడు. తెలుగులో అయినా, ఇంగ్లిష్‌లో అయినా అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇతడిలో ఇంత విషయ పరిజ్ఞానం ఉందా అనిపించేలా చేస్తున్నాడు. ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న పారిశ్రామికవేత్తల సదస్సునే తీసుకుంటే.. అక్కడ ప్రతినిధులతో లోకేష్ సంభాషిస్తున్న తీరు.. సమావేశాల్లో ప్రసంగాలు చూస్తే షాకవ్వక మానరు. ఐటీకి సంబంధించిన విషయాలపై లోకేష్ ఏమాత్రం తడబాటు లేకుండా మాట్లాడుతున్నాడు.
ఆయన ప్రసంగాలు సూపర్ హిట్ అయిపోతున్నాయి. కానీ జగన్ హయాంలో ఆయనతో పాటు ఒక ప్రతినిధుల బృందం దావోస్‌కు వెళ్లినపుడు ఏం జరిగిందో కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒక సమావేశంలో ఓ ప్రతినిధి ఓ అంశం మీద మాట్లాడి.. దాని మీద అభిప్రాయం చెప్పమని జగన్ వైపు చూశారు. కానీ జగన్ మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లు దిక్కులు చూశాడు. ఇప్పుడు మీరే మాట్లాడాలి అన్నట్లు సైగ చేస్తే.. ‘ఇట్స్ ఎ లెంగ్తీ క్వశ్చన్’ అంటూ నవ్వేసి పొడి పొడిగా సంబంధం లేని సమాధానం చెప్పారు.