రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కామనే. ఒక పార్టీపై మరో పార్టీ, ఒక నేతపై మరో నేత విమర్శలు చేసుకోవడం.. తెలిసిందే. కానీ, ఇటీవల కాలంలో నేరుగానే దుర్భాషలు.. వ్యక్తిగత వ్యవహారాలు కూడా తెరమీదికి వస్తున్నాయి. ఇక, ఇప్పుడు ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. అది కూడా పాలక పక్షాలపై జరుగుతుండడం గమనార్హం. వాస్తవానికి ప్రతిపక్షంపై ట్రోలింగ్ జరగడం ఇప్పటి వరకు ఉంది. కానీ, ఇప్పుడు అధికార పక్షంలోని కూటమి పార్టీలపై ట్రోలింగ్ జరగడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
అంటే.. ఇలా ఎందుకు జరగకూడదన్న ప్రశ్న వస్తుంది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ.. ప్రతిపక్షాలో ప్రజలో ఇలా ఎందుకు స్పందించకూడదన్న ప్రశ్న సహజం. కానీ, ఏపీలో గత రెండు మాసాలుగా జరుగు తున్న ట్రోలింగ్ చూస్తే.. అయితే జనసేన మీద, లేకపోతే టీడీపీ మీదే ట్రోలింగ్ ఉంటోంది. దీంతో ఈ వ్యవహారం చర్చకు వస్తోంది. ఇది ఉద్దేశ పూర్వకంగా జరుగుతున్న ట్రోలింగ్ అనేకామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. దీని వెనుక ఎవరు ఉన్నారన్నది కూడా ఆసక్తిగా మారింది.
ఉదాహరణకు.. తాజా పరిణామాలను గమనిస్తే.. సీఎం చంద్రబాబు , మంత్రులు నారా లోకేష్, భరత్‌లు దావోస్ పర్యటనకు వెళ్లారు. వీరిలో జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ మంత్రులు ఎవరు లేరు. ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోల్ అవుతోంది. పేరు పెట్టకుండానే ప్రభుత్వ భాగస్వామ్య పార్టీల పై పెద్ద ఎత్తున జోకులు పేలుతున్నాయి. దీని వెనుక ఎవరు ఉన్నారన్న విషయంపైనా రాజకీయ మే జరుగుతోంది. ప్రతిపక్ష వైసీపీ పాపమేనని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
కూటమిలో చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా వైసీపీ ట్రోల్ చేస్తోందన్న చర్చ సాగుతోంది. కానీ, వైసీపీ నేతలను పలకరిస్తే.. తమకు ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. కూటమి పార్టీల్లోనే ఆధిపత్య రాజకీయా లు సాగుతున్నాయని.. అందుకే ఒకరిపై ఒకరు విమర్శలు, ట్రోల్స్ చేసుకుని ఆ నెపాన్ని తమపై నెడుతు న్నారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైతే.. ప్రస్తుతం దావోస్ పర్యటనలో జనసేన పాల్గొనక పోవడంపై జరుగుతున్న ట్రోల్స్ వ్యవహారం.. పీక్స్‌కు చేరింది. దీనిపై జనసేన ఆగ్రహంతో ఉండగా.. టీడీపీ నేతలు ఆ తప్పు తమది కాదని.. వైసీపీ పాపమేనని చెబుతున్నారు.