మొండోడు రాజు కంటే బలవంతుడన్నసామెత మనకు తెలిసిందే. మరి.. మొండోడే రాజు అయితే.. ఇతగాడి హద్దేముంది. ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్.. ముందు వెనుకా అన్నది చూసుకోకుండా తనకు నచ్చింది నచ్చినట్లుగా చేసుకుంటూ పోతున్నారు. ఎవరేం అనుకుంటారన్నది ఆయన పట్టించుకోవటం లేదు.
ఎవరి అభ్యంతరాల్ని లెక్క చేయట్లేదు. తన ఎజెండాను తాను చేసుకుంటూ పోవటమే తన లక్ష్యమన్నట్లుగా ఆయన తీరు ఉంది. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్న వేళలో.. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని వ్యాఖ్యానించటం.. దానికి అక్కడే ఉన్న హిల్లరీ క్లింటన్ ఫక్కున నవ్వటం తెలిసిందే.
ఈ గల్ప్ ఆఫ్ మెక్సికో చుట్టూ మెక్సికోకు చెందిన టమౌలిపస్.. టబస్కో.. కాంపెచే.. యుక్తాన్.. వెరక్రుజ్ రాష్ట్రాలు ఉన్నాయి. గల్ప్ ఆఫ్ మెక్సికోకు సంబంధించి అమెరికా – మెక్సికో, అమెరికా – క్యూబా, మెక్సికో – క్యూబాల మధ్య సముద్ర సరిహద్దులకు సంబంధించి ఐక్యరాజ్య సమితి తదితర అంతర్జాతీయ సంస్థల సమక్షంలో కొన్ని ఒప్పందాలు జరిగాయి. గల్ప్ ఆఫ్ మెక్సికోలో మిస్సిస్సిపీ.. రియో గ్రాండే నదులు ప్రవహిస్తున్నాయి.
ట్రంప్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత.. దీనికి సంబంధించిన ఎన్నో అంశాల్ని సాంకేతికంగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు యావత్ ప్రపంచం అంగీకరించాల్సి ఉంటుంది. మరి.. ఇంత తలనొప్పిని ప్రపంచం మీద ఇట్టే రుద్దేసిన ట్రంప్ తీరుకు ఎలాంటి స్పందన వ్యక్తమవుతుందన్నది ఇప్పుడు ప్రశ్న.
ఒకసారి అధ్యక్షుడు డిసైడ్ అయ్యాక వాటిని వ్యతిరేకించే అవకాశం లేనప్పటికీ.. ఆ నిర్ణయాల అమలుకు అవసరమైన నిధులు ఇవ్వకుండా అడ్డుకోవటం.. ఇతర అడ్డంకుల్ని క్రియేట్ చేయటం ద్వారా దీని అమలుకు కాంగ్రెస్ ఆటంకం కలిగించే వీలుంది. ఈ పేరు మార్పు ఎపిసోడ్ మీద ఏం జరుగుతుందో చూడాలి.