టాలీవుడ్‌లో బండ్లన్న అంటే ఒక బ్రాండ్. ఆయన మాట పడితే వైబ్రేషన్, స్పీచ్ ఇస్తే సెన్సేషన్. వెండితెరపై నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి, 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్లతో మెగా ప్రొడ్యూసర్‌గా ఎదిగిన బండ్ల గణేష్ ఇంట ఇప్పుడు పెళ్లి సందడి మొదలైంది. ఆయన గారాల పట్టి జనని బండ్ల త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. ఇటీవలె జనని పసుపు వేడుక జరగింది. అందుకు సంబంధించిన ఫోటోలను బండ్లన్న షేర్ చేయడంతో.. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏమిటంటే.. బండ్లన్నకు కాబోయే అల్లుడు ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అని.
బండ్ల గణేష్ అల్లుడి పేరు చిరంజీవి సూర్యతేజ చిలుకూరు. సినిమా గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ, బిజినెస్ రంగంలో ఈయన ఒక పవర్‌ఫుల్ వారసుడు. ఉత్తరాంధ్రలో రియల్ ఎస్టేట్ రంగాన్ని శాసిస్తున్న చిలుకూరి కుటుంబానికి చెందిన వ్యక్తి సూర్యతేజ. కేవలం వారసత్వంతోనే కాకుండా, తన సొంత టాలెంట్‌తో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న యువ పారిశ్రామికవేత్తగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

సూర్యతేజ తండ్రి చిలుకూరి శ్రీనివాస్. ఆయన 1997లో స్థాపించిన చిలుకూరి హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేడు ఏపీలోనే అత్యంత నమ్మకమైన సంస్థల్లో ఒకటిగా నిలిచింది. విశాఖపట్నం చుట్టుపక్కల వందల ఎకరాల్లో ఈ సంస్థ లేఅవుట్లు, విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు నిర్మించింది. ముఖ్యంగా వైజాగ్‌లోని కపులుప్పాడలో దాదాపు 150 ఎకరాల్లో నిర్మించిన బృందావన్ ఎస్టేట్స్ వీరి ఆర్థిక బలానికి, క్రెడిబిలిటీకి నిదర్శనం. 2021లో కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సూర్యతేజ, ఆధునిక సాంకేతికతతో సంస్థను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నారు.
కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, పర్యాటక రంగంలోనూ ఈ కుటుంబానికి బలమైన పట్టు ఉంది. అత్యంత విలాసవంతమైన పెర్ల్ పాలస్ రిసార్ట్ నిర్వహణలోనూ వీరి పాత్ర కీలకం. నాణ్యత, వాస్తు విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా వ్యాపారంలో దూసుకుపోతున్న ఈ ఫ్యామిలీలోకి బండ్లన్న కుమార్తె కోడలిగా వెళ్తుండటం ఇప్పుడు టాలీవుడ్, బిజినెస్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీసింది. మొత్తానికి తన కూతురి కోసం బండ్ల గణేష్ ఒక పక్కా బిజినెస్ టైకూన్‌ను అల్లుడిగా ఎంచుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.