ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. రూపొందించిన బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన అనంతరం. రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము సంతకంతో ఇది చట్టంగా మారుతుంది. రాష్ట్రపతి ఆమదముద్ర అనంతరం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగానే.. రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి వారోత్సవాల పేరుతో సంబరాలు అంబరాన్నంటాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
దీనికి సంబంధించి.. కార్యాచరణను కూడా చంద్రబాబు సిద్ధం చేశారు. ఈ నెల 5-6 తేదీలకు ముందుగానే రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారని.. అది జరిగిన అనంతరం.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అమరావతికి అనుకూలంగా.. కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. దీనిలో ఎమ్మెల్యే లు, మంత్రులు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా పాల్గొనాలని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేయాలని సూచించారు.
ముఖ్యంగా 3 విషయాలను ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. 1) రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఎందుకు అవసరమో.. ప్రజలకు వివరించాలి. తద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు.. ఆర్థిక ప్రయోజనాలు వంటివాటిని వివరించారు. 2) రైతుల త్యాగాలు. వేలాదిమంది రైతులు తమ పొలాలను నిస్వార్థంగా త్యాగం చేసిన నేపథ్యంలో వారి త్యాగాలను సోదాహరణంగా వివరించాలని పేర్కొన్నారు. ఇక, వైసీపీ వ్యవహారాన్ని కూడా ఎండగట్టాలని నాయకులకు పిలుపునిచ్చారు.
వైసీపీకి రాజధాని పై అవగాహన లేదని, విశాల ప్రయోజనాలపై ఏమాత్రం నిబద్ధత లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యానికి తోడు ఇప్పుడు కూడా అమరావతిని వ్యతిరేకిస్తున్న తీరును ప్రజల్లోకి బలంగా ప్రచారం చేయాలన్నారు. కాగా.. ప్రస్తుతం వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం పూట ఇంటింటికీ ప్రచారం చేయాలని.. సాయంత్రం వేళల్లో కీలక ప్రాంతాల్లో సభలు సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.