విదేశీ ప్రయాణాలు చేయాలని అందరికీ ఉంటుంది, కానీ ఆలయాల్లో సేవలందించే అర్చకులు మాత్రం ఇకపై విమానం ఎక్కే ముందు వందసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే, విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చిన అర్చకులు దేవస్థానాల్లోని ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు నిర్వహించడంపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సనాతన సంప్రదాయాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేస్తూ ధార్మిక పరిషత్, శృంగేరి శారదా పీఠం(Sringeri Sharada Peetham) జారీ చేసిన నిబంధనలకు చట్టబద్ధత కల్పించింది.
సాధారణంగా ఆగమ శాస్త్రాల ప్రకారం.. గర్భాలయంలోని మూలవిరాట్టుకు పూజలు చేసే అర్చకులకు కొన్ని కఠినమైన నియమాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లినప్పుడు ఆచార వ్యవహారాల్లో మార్పులు రావడం, ఆహార నియమాలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల వారు పవిత్రత కోల్పోతారని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనిపై విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మ దేవస్థానానికి చెందిన సుబ్రహ్మణ్యం సోమయాజి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు వెళ్లి వచ్చిన వారు కూడా గర్భాలయంలో పూజలు చేస్తున్నారని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు.
ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు, ధార్మిక పరిషత్ జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చిన అర్చకులు ఆలయ గర్భాలయంలోకి ప్రవేశించి ప్రధాన పూజలు నిర్వహించడంపై నిషేధం విధించారు. ఒకవేళ అర్చకులు విదేశాలకు వెళ్లాల్సి వస్తే, తిరిగి వచ్చిన తర్వాత వారు కేవలం ఆలయం బయట నిర్వహించే వ్రతాలు, పూజలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా, సంప్రదాయాలకు విరుద్ధంగా ముఖ క్షవరం (Shaving) చేసుకోవడం లేదా జుట్టు కత్తిరించుకోవడం వంటివి చేసిన వారు కూడా గర్భాలయ సేవలు నిర్వహించడానికి అనర్హులని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ స్పందిస్తూ.. శృంగేరి పీఠం ఇచ్చిన మార్గదర్శకాలకు తాము కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే దీనిపై సర్క్యులర్ జారీ చేశామని వెల్లడించింది. హైకోర్టు(High Court) తాజా ఆదేశాలతో ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల్లో ఈ నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. ఆధునిక కాలంలో విదేశీ యానాలు సర్వసాధారణమైనా.. ఆలయ పవిత్రత, ఆగమ నియమాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది.