ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) భౌగోళిక స్వరూపం మరోసారి కీలక మార్పులకు లోనైంది. గతంలో ఉన్న 26 జిల్లాల సంఖ్య ఇప్పుడు 28కి చేరుకుంది. పరిపాలనా సౌలభ్యాన్ని పెంపొందించడం, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా విడుదల చేసిన ఈ సరికొత్త మ్యాప్, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ మరియు పరిపాలనా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం రెండు ప్రధాన కేంద్రాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటించారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ 'మార్కాపురం' కేంద్రంగా ఒక జిల్లాను ఏర్పాటు చేశారు. అలాగే, రాష్ట్రానికి జీవనాడి అయిన 'పోలవరం'(Polavaram) ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తిస్తూ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలను కలిపి పోలవరం కేంద్రంగా మరో జిల్లాను రూపొందించారు. ఈ రెండు జిల్లాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కొత్త మ్యాప్‌లో అత్యంత ప్రధానమైన అంశం రాజధాని స్పష్టత. గత కొంతకాలంగా ఏపీ రాజధాని విషయంలో కొనసాగుతున్న సందిగ్ధతకు ప్రభుత్వం అధికారికంగా తెరదించింది. విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన మ్యాప్‌లో 'అమరావతి'(Amaravathi)ని రాష్ట్ర రాజధానిగా స్పష్టంగా ముద్రించడం గమనార్హం. దీనితో అధికారికంగా రాష్ట్ర కేంద్రం ఏదనే విషయంలో సామాన్య ప్రజలకు, అధికారులకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చినట్లయింది.
ఒకప్పుడు 13 జిల్లాలుగా ఉన్న ఏపీ(AP), గత ప్రభుత్వ హయాంలో 26 జిల్లాలుగా రూపాంతరం చెందింది. ఇప్పుడు ఆ సంఖ్య 28కి చేరడం వెనుక బలమైన కారణం ఉంది. జిల్లా కేంద్రం ప్రజలకు దగ్గరగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు, సేవలు వేగంగా అందుతాయని, మౌలిక సదుపాయాల కల్పన సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం ప్రాంతాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి రావడం వల్ల ఆ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. కొత్త మ్యాప్ అమల్లోకి రావడంతో, త్వరలోనే ఆయా జిల్లాల్లో పరిపాలనా యంత్రాంగం పూర్తిస్థాయిలో కొలువుదీరనుంది.