దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి తమిళనాడు(Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. ముఖ్యంగా కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్ నియోజకవర్గం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ అడుగుపెడుతుండటమే. సోమవారం నాగర్‌కోయిల్‌లో బీజేపీ అభ్యర్థి ఎం.ఆర్. గాంధీకి మద్దతుగా పవన్ నిర్వహించనున్న మెరుపు ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కేవలం సినిమా స్టార్‌గానే కాకుండా, ఏపీలో కూటమిని అధికారంలోకి తెచ్చిన గేమ్ ఛేంజర్ గా పవన్ ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపుతారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
తమిళనాడులో బీజేపీ(BJP) పవన్‌ను రంగంలోకి దించడం వెనుక ఒక బలమైన వ్యూహం కనిపిస్తోంది. నాగర్‌కోయిల్, హోసూరు, చెన్నై పరిసర ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం కోసం పవన్ పడ్డ శ్రమ, ఆయన చూపిన చొరవ అక్కడ సత్ఫలితాలను ఇచ్చాయి. ఇప్పుడు అదే సక్సెస్ ఫార్ములాను తమిళ గడ్డపై కూడా ప్రయోగించాలని ఎన్డీయే భావిస్తోంది. పవన్ కళ్యాణ్ కరిష్మాకు, ఎం.ఆర్. గాంధీకి ఉన్న క్లీన్ ఇమేజ్ తోడైతే విజయం నల్లేరుపై నడకేనని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన ప్రసంగాల్లో కేవలం రాజకీయాలే కాకుండా, సనాతన ధర్మ పరిరక్షణ, పొరుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సామరస్యం గురించి గళమెత్తే అవకాశం ఉంది. ఏపీలో మాదిరిగానే ఇక్కడ కూడా డీఎంకే విముక్త ప్రభుత్వం రావాలనే నినాదాన్ని ఆయన బలంగా వినిపించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత, సినిమా అభిమానుల నుంచి లభిస్తున్న భారీ స్పందన చూస్తుంటే, పవన్ పర్యటన బీజేపీలో కొత్త జోష్ నింపుతుందనడంలో సందేహం లేదు. కాగా, పవన్ పర్యటన నేపథ్యంలో నాగర్‌కోయిల్‌లో ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. సినిమా గ్లామర్, పొలిటికల్ పవర్ కలిసిన ఈ పర్యటన తమిళ రాజకీయాల్లో ఏ మేరకు అలజడి సృష్టిస్తుందో చూడాలి.