ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్.. టెక్కీకి రూ.2.36 కోట్ల కుచ్చుటోపీ!

admin
Published by Admin — April 06, 2026 in Telangana
News Image

హైదరాబాద్: సోషల్ మీడియాలో వచ్చే ఒక చిన్న హాయ్ మీ జీవితాన్నే మార్చేయొచ్చు.. కానీ అది మంచి వైపు కాదు, ఇలా కోలుకోలేని ఆర్థిక సంక్షోభం వైపు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఒక అందమైన అమ్మాయి మాటలు నమ్మి, హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఏకంగా రూ. 2.36 కోట్లు పోగొట్టుకున్నాడు. అత్యాశకు మాయమాటలు తోడైతే సైబర్ నేరగాళ్లు ఎలా రెచ్చిపోతారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నివసించే వీరభద్రరావు అనే టెక్కీకి గత ఏడాది ఆగస్టులో కోరా అనే పేరుతో ఒక ఫేస్‌బుక్(Facebook) రిక్వెస్ట్ వచ్చింది. తనది సింగపూర్ అని, ప్రస్తుతం ముంబైలో ఉంటున్నానని నమ్మబలికిన ఆ కిలేడీ, నెలల తరబడి చాటింగ్‌తో అతడి నమ్మకాన్ని గెలుచుకుంది. మెల్లగా తన అసలు రంగు బయటపెడుతూ.. తన స్నేహితులంతా ఫేస్‌బుక్ స్టోర్ ట్రేడింగ్‌లో కోట్లు సంపాదిస్తున్నారని, అతడిని కూడా పెట్టుబడి పెట్టమని ఉసిగొల్పింది.

మొదట సందేహించినా, ఆమె పంపిన లాభాల స్క్రీన్ షాట్లను చూసి వీరభద్రరావు నమ్మిపోయాడు. ఆమె పంపిన ఒక ఏపీకే (APK) ఫైల్ ద్వారా ఒక నకిలీ ట్రేడింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. దీనికి తోడు బెల్లా అనే మరో విదేశీ స్నేహితురాలిని పరిచయం చేసి, ఆమె సలహాలతో పెట్టుబడులు పెట్టాలని సూచించింది. ఆ యాప్ స్క్రీన్‌పై లాభాలు భారీగా కనిపిస్తుండటంతో, అది నిజమని నమ్మిన బాధితుడు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో విడతల వారీగా రూ. 2.36 కోట్లు కేటాయించాడు.

ఖాతాలో లాభాలు కోట్లలో కనిపిస్తున్నా, వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసినప్పుడే అసలు విషయం బయటపడింది. సాంకేతిక కారణాలంటూ, మరిన్ని ఫీజులు కట్టాలంటూ యాప్ నిర్వాహకులు కొర్రీలు పెట్టడంతో వీరభద్రరావుకు అనుమానం వచ్చింది. తీరా చూస్తే తాను మోసపోయానని, అటు కోరా.. ఇటు బెల్లా ఇద్దరూ సైబర్ మాయగాళ్లని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైమ్(Cyberabad Cyber ​​Crime) పోలీసులను ఆశ్రయించాడు.

Tags
Cyber Crime Hyderabad Scam Alert Techie Cyber Security Online Fraud
Recent Comments
Leave a Comment

Related News