రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఉండవనే మాటను మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న ఒక వార్త మాత్రం అంతకు మించి అనేలా ఉంది. నిన్నటి వరకు రాజకీయంగా ఉప్పు నిప్పులా తలపడిన ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు అద్దె ఇల్లు బంధం కుదిరింది. సాక్షాత్తు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు(Raghu Rama Krishna Raju), వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఇంట్లోనే నివాసం ఉంటుండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
వైసీపీ(YCP) అధికారంలో ఉన్న సమయంలో రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీకి సింహస్వప్నంగా మారారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి, రఘురామ మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన యుద్ధం అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునేవారు. కట్ చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ, తాడేపల్లిలో జగన్ నివాసానికి అతి సమీపంలోనే ఉంటున్నారు. అది కూడా విజయసాయిరెడ్డికి చెందిన ఇంట్లో ఆయన అద్దెకు ఉండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
ఈ ఆసక్తికర విషయాన్ని రఘురామ స్వయంగా బయటపెట్టారు. విజయసాయిరెడ్డికి, తనకు వ్యక్తిగత వైరం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనపై వచ్చిన బూతు పురాణం వెనుక అసలు కథను ఆయన బయటపెట్టారు. `` విజయసాయిరెడ్డి పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాలను వేరే వ్యక్తులు నిర్వహించేవారని, జగన్(Jagan) మెప్పు కోసమే అప్పట్లో తనను బూతులు తిట్టేవారని`` రఘురామ విశ్లేషించారు. విజయసాయిరెడ్డి స్వతహాగా సంస్కారవంతుడని, చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి కాదని ఆర్ఆర్ఆర్ సర్టిఫికేట్ ఇవ్వడం విశేషం.
తాను ఉండటానికి ఇల్లు వెతుకుతున్న సమయంలో, విజయసాయిరెడ్డి(Vijaysai Reddy) ఇల్లు ఖాళీగా ఉందని తెలిసి ఆయన్నే సంప్రదించానని రఘురామ తెలిపారు. దీనికి విజయసాయి కూడా సానుకూలంగా స్పందించి ఇల్లు అద్దెకు ఇచ్చారట. మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కొంచెం దూరంలోనే, ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేత ఇంట్లోనే రఘురామ తిష్ట వేయడం రాజకీయంగా పెద్ద చర్చకే దారితీస్తోంది. నాడు తనను హింసించిన పార్టీకి చెందిన కీలక నేత ఇంటినే తన నివాసంగా మార్చుకుని, రఘురామ తనదైన శైలిలో రివెంజ్ తీర్చుకుంటున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది.