అభిమానించటానికి.. ఆరాధించటానికి మధ్య బోలెడంత వ్యత్యాసం ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే బిజీ షెడ్యూల్ మీద క్రీడల మీద తనకున్న మమకారాన్ని.. ఇష్టాన్ని.. తాను ఇచ్చే ప్రాధాన్యతను ప్రదర్శించే ప్రతి అవకాశాన్ని వదలని ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm revanth reddy)ని చెప్పాలి. ఫుట్ బాల్ ఆట మీద ఆయనకున్న ఆసక్తి ఎంతన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చూశాం. ఫుట్ బాల్(football) దిగ్గజం మెస్సీతో మ్యాచ్ కు ముందు.. దాదాపు రెండు వారాల పాటు సీరియస్ గా ప్రాక్టీస్ చేసిన ఆయన.. ఆ తర్వాత నుంచి అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ తన లోని క్రీడాకారుడ్ని బయటకు తీస్తున్నారు.
తాజాగా గచ్చిబౌలి స్టేడియంలో గోవా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ లో సీఎం రేవంత్ గోవా పోలీస్ జట్టు తరఫు ఆడారు.ఈ సందర్భంగా ఎరుపు రంగు జెర్సీతో బరిలోకి దిగిన ఆయన ఏకంగా మూడు గోల్స్ కొట్టారు. మైదానంలో చురుకుగా కదులుతూ.. సీరియస్ గా ఆడిన తీరు చూస్తే.. ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా వ్యవహరించారని చెప్పొచ్చు. మైదానం బయట ముఖ్యమంత్రే కానీ.. ఆటలోకాదన్న విషయాన్ని తన బాడీ లాంగ్వేజ్ ద్వారా ప్రదర్శించారు.
తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వారిలో క్రీడలకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు.. స్వయంగా సీఎమ్మే బరిలోకి దిగిన ఆడిన సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచిపోతారు. ఏమైనా సీఎం రేవంత్ పుణ్యామా అని క్రీడలకు ప్రాధాన్యత మొదలు కావటం ఒక ఎత్తు అయితే.. ఫుట్ బాల్ క్రీడకు కొత్త ఇమేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. నిజానికి ఫుట్ బాల్ విషయానికి వస్తే గతంలో ఫుట్ బాల్ కు హైదరాబాద్ కు మంచి పేరుండేది. క్రికెట్ కు క్రేజ్ పెరిగి.. ఫుట్ బాల్ కు ఆదరణ తగ్గింది. ముఖ్యమంత్రి రేవంత్ పుణ్యమా అని.. ఫుట్ బాల్ క్రీడ తరచూ వార్తల్లోకి వస్తోంది.
మ్యాచ్ కు ముందు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్.. యువత మైదానాన్ని వీడి పబ్ లు.. డ్రగ్స్ కల్చర్ వైపు మళ్లుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. మెట్రో నగరాల్లో బయటపడుతున్న డ్రగ్స్కేసుల్లో ఎక్కువమంది బాగా చదివినవారే ఉంటున్నారని.. ఐటీ.. ఫార్మా రంగాల వైపు ఫోకస్ చేస్తున్న యూత్.. మైదానానికిరావటం లేదన్నారు. భారత ఫుట్ బాల్ చరిత్రలో హైదరాబాద్ కు గొప్ప పేరుందని.. కాలక్రమంలో క్రీడా మైదానాలను వదిలేశామన్న వేదనను వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని.. పీపీపీ విధానంలో ప్రారంభించి.. గొప్ప క్రీడాకారులను డైరెక్టర్లుగా నియమించినట్లుగా పేర్కొన్నారు. తాను పెద్ద క్రీడాకారుడినేం కాదని.. క్రీడాస్ఫూర్తిని చాటే ఉద్దేశంతోనే పోటీల్లో పాల్గొంటున్నట్లుగా చెప్పిన రేవంత్ మాటలు ఆసక్తికరంగా మారాయి.