జగన్ దెబ్బకు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం అటకెక్కిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో మొదలుబెట్టి సగం పూర్తయిన నిర్మాణాలు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే జగన్ ఓటమి తర్వాత చంద్రబాబు సీఎం కాగానే అమరావతి రాజధాని నిర్మాణ పనులు రీస్టార్ట్ అయ్యాయి. సీఆర్డీఏ అథారిటీ బిల్డింగ్ పనులు పున:ప్రారంభించడంతో అమరావతి రీస్టార్ట్ బటన్ ను చంద్రబాబు నొక్కారు. ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాబోయే మూడేళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తాజాగా ప్రకటించారు.
న్యాయపరమైన ఇబ్బందుల వల్ల పనుల ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించిన తర్వాత మీడియాతో నారాయణ మాట్లాడారు. ఇప్పటి వరకు 40 పనులకు టెండర్లు పిలిచామని, అమరావతిని ప్రపంచ టాప్ 5 నగరాల్లో ఒకటిగా చేసే లక్ష్యంతో ఐకానిక్ భవనాల నిర్మాణానికి నార్మన్ ఫోస్టర్ చేత డిజైన్ చేయించామని తెలిపారు.
2019కు ముందే టీడీపీ హయాంలో జడ్జిలు, అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4,053 ఫ్లాట్ లతో అపార్ట్ మెంట్ పనులు ప్రారంభించామని చెప్పారు. 250 మీటర్ల ఎత్తుతో అసెంబ్లీని నిర్మిస్తామని, సమావేశాలు లేని రోజుల్లో దాన్ని టూరిజం స్పాట్ గా మార్చేలా డిజైన్లు రూపొందించామని తెలిపారు. తాగునీటి పైపులు, విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ లో ఉండేలా డిజైన్ చేస్తున్నామన్నారు.