వైసీపీ కీలక నేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీకి మరియు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి ప్రకటించారు. భవిష్యత్తులో మరే రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేసిన విజయసాయి రెడ్డి.. ప్రస్తుతం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు విజయసాయి రెడ్డి రాజీనామా వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. వైఎస్ కుటుంబంలోని మూడు తరాలతో అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి.. వైఎస్ మరణం అనంతరం జగన్ కు వెన్నుదన్నుగా నిలిచారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నడిచారు. 2016లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. వైసీపీలో జగన్ తర్వాత అన్ని తానే అనేంతలా ఎదిగారు. పార్టీలో నెం.2 గా తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించారు. ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను దగ్గరుండి చూసుకున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయినా కూడా పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గలేదు. 2022లో రెండోసారి విజయసాయి రెడ్డిని రాజ్యసభ్యకు పంపారు జగన్.
ఆయన పదవీకాలం 2028 వరకు ఉంది. కానీ ఇంతలోనే ఆయన ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న తర్వాత.. కీలక నేతలంతా జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో విజయసాయిరెడ్డి కూడా చేరిపోయారు. విశాఖపట్నంలో తలెత్తిన వివాదాలకు విజయసాయిరెడ్డి కేంద్ర బిందువుగా ఉన్నారు. దావుద్ స్థాయిలో ఆయన అక్కడ భూమాఫియా నడిపారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన కాకినాడ పోర్టు కేసులోనూ ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్నాయి.
ఇప్పటికే జగన్ ఎదుర్కొంటున్న పలు కేసుల్లో సహ నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి.. వ్యక్తిగతంగా కూడా చాలా కేసుల్లో ఇరుక్కున్నారు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వెనుక సైతం ఆయన హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా చేసిన పాపాలు, దందాలు ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఈసారి ఆయన జైలుకు వెళ్లారంటే బయటకు వచ్చే అవకాశమే ఉండదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆ భయతోనే ఆయన రాజీనామా వైపు అడుగులు వేశారని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది.
అయితే ఇలా రాజీనామా చేశారో లేదో అలా సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని, అనుమతి ఇవ్వాలంటూ విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్నందున.. విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు తన విదేశీ పర్యటన ఉందని.. తాను నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం జనవరి 27కి వాయిదా వేసింది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్తే తిరిగి వస్తారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.