ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ స్పెషల్ గిఫ్ట్ ను ప్రజెంట్ చేశారు. దావోస్ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ భేటీ అయిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం రాకతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని.. త్వరలో రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వాములు కావాలని ఆ సందర్భంగా బిల్ గేట్స్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా చంద్రబాబుపై ఉన్న అభిమానంతో బిల్ గేట్స్ తాను రచించిన `సోర్స్ కోడ్ – ఏ మెమరీ అబౌట్ ది ఎక్స్‌పీరియన్సెస్ అండ్ లెసన్స్ దట్ షేప్డ్ హిస్ ఇన్‌క్రిడబుల్ జర్నీ` అనే పుస్తకాన్ని బహుబతిగా అందించారు. ఇంకా ఈ పుస్తకం విడుదల కాలేదు. అంతకన్నా ముందే `సోర్స్ కోడ్` బుక్ కాపీని చంద్రబాబుకు బిల్ గేట్స్ బహుకరించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు స్వయంగా పంచుకున్నారు.
`నా స్నేహితుడు బిల్ గేట్స్ సోర్స్ కోడ్ పేరిట పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ పుస్తకం కాపీని నాకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. బిల్ గేట్స్ తన అద్భుతమైన జీవత ప్రయాణంలోని అనుభవాలు మరియు పాఠాలను ఈ పుస్తకంలో రూపొందించారు. అతని ప్రారంభ సంవత్సరాల నుండి కళాశాలను విడిచిపెట్టి, మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించాలనే అతని నిర్ణయం వరకు ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం. బిల్‌గేట్స్‌కు మా శుభాకాంక్షలు` అని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.