వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయసాయి రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కడ్ కూడా ఆమోదించారు. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడను అని సాయిరెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ రాజీనామా వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నాయకుడు జగన్ పై నమ్మకం లేకనే విజయసాయి రాజీనామా చేశారని చంద్రబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ఆ పార్టీ నేతలకు అర్థమవుతుందని, పార్టీ ఉన్న పరిస్థితిని దానిని బట్టి ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటుంటారని చెప్పారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలుంటారని, లేకుంటే వారి వారి మార్గాలు, దారులు చూసుకుంటారని అన్నారు. వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేసిన పరిస్థితి ఏపీలో తప్ప దేశంలో మరెక్కడా లేదని అన్నారు. రాజకీయాల్లో ఉండేందుకు అర్హత లేని వ్యక్తులు వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారం అని, దీని గురించి ఇంతకన్నా వేరే ఏమీ మాట్లాడదలుచుకోలేదని చంద్రబాబు చెప్పారు.
మరోవైపు, దావోస్ పర్యటన విజయవంతమైందని చంద్రబాబు అన్నారు. జగన్ దెబ్బకు విధ్వంసమైన ఏపీని గాడిలో పెడుతున్నామన్నారు. కేవలం 7 నెలల్లోనే ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించామని చెప్పారు. త్వరలోనే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాబోతున్నాయని తెలిపారు. భవిష్యత్ లో ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా తయారుచేస్తామని, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. తాను 4వ సారి సీఎం అయ్యాక ఏపీ బ్రాండ్ ను ప్రపంచమంతా ప్రమోట్ చేస్తున్నానని అన్నారు.