బీఆర్ ఎస్(brs) ఆవిర్భావ దినోత్సవ వేళ.. కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీ.. గత పార్టీగానే మిగిలిపోతుందన్నారు. దానికి గతమే తప్ప, భవిష్యత్తులేదని అన్నారు. ఇక, తమకు ప్రధాన ప్రతిపక్షం.. ప్రతిపక్షం అనేదే లేదని, తామే అధికార పక్షం, తామే ప్రతిపక్షమని వ్యాఖ్యానించారు. బీఆర్ ఎస్ పార్టీ నేతలు.. తెచ్చి పెట్టుకున్న నటనతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిని తెలంగాణ సమాజం హర్షించదని చెప్పారు. ``ఉద్యమం సమయంలో వారు ఎలా వ్యవహరించారో.. అధికారంలో ఉన్న పదేళ్లు కూడా అలానే వ్యవహరించారు`` అని అన్నారు.
కేసీఆర్(kcr) బాగుండాలి!
బీఆర్ ఎస్ అధినేత ఆయురారోగ్యాలతో బాగుండాలనే తాను కోరుకుంటానని.. ఆయన చచ్చిపోవాలనితాను కోరుకోనని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ జీవించి ఉంటేనే.. తమ పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుస్తుందన్నారు. ప్రస్తుతం ప్రజలంతా తమతోనే ఉన్నారని సీఎం చెప్పారు. కేసీఆర్ తోపాటు.. బీఆర్ ఎస్ పార్టీతోనూ తెలంగాణ సమాజం ఎప్పుడో తెగతెంపులు చేసుకుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి మాత్రమేనని అన్నారు. ఆయన వల్ల ఎవరికి ఏం ఉపయో గమో అందరికీ తెలిసిందేనని చెప్పారు.
మర మనిషో కాదో..
ఇటీవల కేసీఆర్ తనయ, తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధ్యక్షురాలు.. పార్టీ ఆవిర్భావ సభలో చేసిన కామెంట్లపైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. `కేసీఆర్ .. మన మనిషి కాదు, మర మనిషి` అని కవిత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావించిన సీఎం.. ``కేసీఆర్ మర మనిషో.. ఇంకేమైనానో.. ఆ కుటుంబానికే తెలియాలి.`` అని అన్నారు. ఆయన తమకు ప్రతిపక్షం కాద న్నారు. ప్రజలు తమవెంటే ఉన్నారని తెలిపారు. వివక్ష లేనిపాలన అందిస్తున్నామని రేవంత్ చెప్పారు. ఎవరో ఏదో అంటే.. తాము స్పందించాల్సిన అవసరం లేదని పరోక్షంగా కవితపై ఆయన వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం అవినీతిపై..
కాళేశ్వరం అవినీతి, అక్రమాలపైచర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాము నియమించిన పీసీ ఘోష్ కమిషన్ రిపో ర్టును హైకోర్టు తప్పుబట్టలేదన్నారు. కానీ, కొన్ని సాంకేతిక అంశాలను మాత్రమే ప్రశ్నించిందన్నారు. చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పిందన్నారు. అయినప్పటికీ కాళేశ్వరంపై చర్యలు తీసుకుని తీరుతామన్నారు. దీనిపై సీబీఐని నియమించాలని తాము కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. సీబీఐ విచారణ తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు.