బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత(kavita) తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ ఎస్) పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి గతంలో కేసీఆర్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ ఎస్)(trs) పార్టీలోని సమితి తీసేసి..సేనగా మార్చుకుని ఆమె పార్టీ పేరును `టీఆర్ ఎస్`గా ప్రకటించారు. దీంతో ప్రస్తుత బీఆర్ ఎస్ పార్టీపైనా.. ఆ పార్టీ ఓటు బ్యాంకుపైనా ప్రభావం పడుతుందని.. అందరూ భావిస్తున్నారు. అయినప్పటికీ బీఆర్ ఎస్ పార్టీ తరపున పెద్దగా ఎవరూ స్పందించలేదు. అయితే.. కవిత పార్టీ ప్రకటించిన రోజే సోషల్ మీడియా నకిలీ-ఒరిజినల్ అంటూ ట్రోల్స్‌కు పరిమితం అయ్యారు.
కాగా.. తాజాగా బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(ktr) స్పందించారు. తన సోదరి.. కవిత పెట్టిన పార్టీని ఆయన లైట్ తీసుకున్నట్టు చెప్పారు. `ఎన్నో పార్టీలు వస్తుంటాయి. పోతుంటాయి. అవన్నీ లెక్కలోకి వచ్చేవి కాదు`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కొత్తపార్టీని పెద్దగా లెక్కలోకి తీసుకోబోమన్నారు. 25 ఏళ్లపాటు నిలిచి.. నిలబడిన పార్టీగా బీఆర్ ఎస్ హిస్టరీ క్రియేట్ చేసిందన్నారు. పార్టీ పరంగా.. తమ ప్రభావంమరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
ఇదేసమయంలో తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌పైనా కవిత వ్యాఖ్యలు గుప్పించిన విషయం తెలిసిందే. మన మనిషి కాదు.. మర మనిషి అంటూ.. ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైనా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ``కేసీఆర్‌ను కూడా ఎవరెవరో ఏదేదో అంటున్నారు. వాటిని కూడా మేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏనుగు వెళ్తుంటే అల్లరి చేసేవారు.. చాలా మంది ఉంటారు. అన్నీ పట్టించుకోం. పార్టీ పరంగా ఏం చేయాలన్నది చూస్తాం. ప్రజల తరఫున మరింత బలంగా కొట్లాడు తాం.`` అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. త్వరలోనేకేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని చెప్పారు. ప్రజల సమస్యలపై ఉద్యమ స్థాయిలో పోరాటం జరుగుతుందన్నారు.
ఆవిర్భావ సభలో తీర్మానాలు..
బీఆర్ ఎస్ ఆవిర్భావ సభలో పలు తీర్మానాలు చేశారు. 1) తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం. 2) సబ్బండ వర్గాలు, సకల జనులకు ధన్యవాదాలు తెలిపే తీర్మానం. 3) కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఏ విధంగా ముందుకు సాగాలనే తీర్మానం.. వంటివి చర్చించారు. రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన కేసీఆర్‌కు ఐక్యరాజ్యసమితి నుంచి ప్రశంసలు వచ్చిన విషయాన్ని కూడా సభలో ప్రస్తావించారు.