నాని, విజయ్ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకుంటున్నారు?

admin
Published by Admin — March 02, 2025 in Movies
News Image

సోషల్ మీడియా పుణ్యమా అని ఫ్యాన్ వార్స్ ఎంత తీవ్ర స్థాయికి చేరాయో గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. తమ హీరోను అభిమానించడం, ఆరాధించడం కంటే కూడా.. అవతలి హీరోను ద్వేషించడం, తన మీద విషం కక్కడమే ఫ్యాన్స్‌కు ప్రయారిటీగా మారుతోంది. ఒక స్టార్ హీరో సినిమా రిలీజైతే చాలు.. వేరే హీరోల ఫ్యాన్స్ గ్రూపులు కట్టి దాని మీద విష ప్రచారం చేయడం ఇప్పుడు ట్రెండుగా మారింది.

దేవర, పుష్ప, గేమ్ చేంజర్.. ఇలా చాలా సినిమాలు ఇలాంటి నెగెటివిటీని ఎదుర్కొన్నవే. ఐతే టాప్ స్టార్ల ఫ్యాన్స్ మధ్య గొడవలు ఈనాటివి కావు. ఎన్టీఆర్, ఏఎన్నార్ రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ కొత్త తరం హీరోల అభిమానుల మధ్య కూడా తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతుండడమే విడ్డూరం. అందులోనూ స్వశక్తితో ఎదిగిన ఇద్దరు హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ గత మూణ్నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఆ హీరోలు.. నాని, విజయ్ దేవరకొండ కావడం గమనార్హం.

విజయ్‌కి నటుడిగా బ్రేక్ వచ్చిందే నాని సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో. ఆ తర్వాత కూడా ఇద్దరూ చాలా సన్నిహితంగా కనిపించేవారు. ఒకరి ఈవెంట్లలో ఒకరు పాల్గొన్నారు కూడా. అలాంటిది ఇప్పుడు వీళ్లిద్దరి అభిమానులు పడుతున్న గొడవలు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. తన సినిమాతో బ్రేక్ అందుకున్న విజయ్.. తనను మించి ఎదిగిపోవడంతో తట్టుకోలేక నాని సోషల్ మీడియాలో పీఆర్ టీమ్స్‌ను పెట్టి విజయ్ మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశాడట.

పైకి మంచివాడిలా కనిపించే నాని.. తెర వెనుక చాలా చేస్తున్నాడని.. విజయ్ సినిమాల మీద విషం చిమ్మించాడని అతడి అభిమానులు ఆరోపిస్తున్నారు. ఐతే దీనికి నాని ఫ్యాన్స్ కూడా దీటుగా బదులిస్తున్నారు. నాని మీద కావాలనే లేని పోని ఆరోపణలు చేస్తున్నారని.. పీఆర్ టీమ్‌లతో అవతలి హీరోల మీద నెగటెివిటీ స్ప్రెడ్ చేయించం విజయ్ సన్నిహితులకే అలవాటు అని.. సరైన సినిమాలు ఎంచుకోకపోవడం వల్ల డిజాస్టర్లు పడ్డాయి కానీ.. విజయ్‌ మీద నాని నెగెటివిటీ స్ప్రెడ్ చేయించడం ఏంటని వాళ్లు అంటున్నారు. మొత్తానికి ఈ అభిమానులు గొడవ పడే క్రమంలో హీరోలను దారుణమైన మాటలు అంటూ.. ఫ్యాన్ వార్స్‌ను ఇంకా లో లెవెల్‌కు తీసుకెళ్తుండడం ఆందోళనకరం.

Recent Comments
Leave a Comment

Related News