టెక్నాలజీని వాడుకోడంతో సీఎం చంద్రబాబు దేశంలోని మిగతా ముఖ్యమంత్రుల కంటే పదడుగులు ముందే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఐటీ రంగం సాధించిన పురోగతిని పాతికేళ్ల కిందే ఊహించిన విజనరీ లీడర్ ఆయన. డ్రోన్, ఏఐ, డీప్ టెక్ వంటి టెక్నాలజీలు భవిష్యత్తును ఏలబోతున్నాయని చంద్రబాబు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు టెక్నాలజీని ఉపయోగించుకొని మరో సరికొత్త ప్రయత్నం చేశారు. తొలిసారిగా కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు లేకుండా ఏఐ టెక్నాలజీతో చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించి ఔరా అనిపించారు.
ఏఐ సాయంతో చంద్రబాబు ప్రెస్ మీట్ లైవ్ కవరేజీ అందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏఐ వ్యవస్థను చంద్రబాబు ఏర్పాటు చేశారు. వాస్తవానికి సీఎం క్యాంపు ఆఫీసులో ప్రభుత్వ నిధులతో ఆ వ్యవస్థ ఏర్పాటు చేసే అవకాశముంది. కానీ, అందుకు అంగీకరించని మంత్రి నారా లోకేశ్ సొంత నిధులు వెచ్చించి ఈ ఏర్పాట్లు చేయించారు. మీటింగ్ హాల్ లో 4 కెమెరాలతో మల్టీ వీడియో కెమెరా సిస్టమ్ ను ఏర్పాటు చేశారు.
ఆ హాల్ లోకి చంద్రబాబు ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఓ కెమెరాకు కమాండ్ ఇస్తే చాలు లైవ్ ప్రారంభమవుతుంది. మోషన్ సెన్సార్, ఏటీ టెక్నాలజీతో ఆ కెమెరాలు చంద్రబాబును సెంటర్ ఫ్రేమ్ లో ఉండేలా ఫోకస్ చేస్తాయి. మామూలుగా అయితే, ప్రెస్ మీట్ లైవ్ కవరేజీకి కనీసం 8 మంది కెమెరామన్లు, వీడియోగ్రాఫర్లు, తదితర సిబ్బంది కావాల్సి ఉంటుంది. కానీ, ఈ ఏఐ సిస్టమ్ ద్వారా ఒక్కరితోనే 8 మంది పని చేయవచ్చు. అయితే, చంద్రబాబు ఈ టెక్నాలజీతో తమకు పని తగ్గించారని కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.