పద్మ అవార్డులు..కేంద్రంపై రేవంత్ గరం గరం!

admin
Published by Admin — January 26, 2025 in Politics
News Image

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ఏపీకి చెందిన ఐదుగురికి పద్మ పురస్కారం వరించగా….తెలంగాణ నుంచి ఇద్దరినే వరించింది. ఈ క్రమంలోనే పద్మ పురస్కారాల ఎంపికపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు.

పక్క రాష్ట్రానికి ఐదు ఇచ్చినప్పుడు తెలంగాణకు కనీసం నాలుగు ఇవ్వాల్సిందని, రెండు ఇవ్వడంతో తనతోపాటు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. పురస్కారాల ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని ఆరోపించారు. అంతేకాదు, ఈ విషయంపై త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాయబోతున్నానని చెప్పారు.

తెలంగాణ నుంచి పద్మ పురస్కారాల కోసం గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖుల పేర్లు పంపించినా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించిందని అన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు.

డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ, మంద కృష్ణ మాదిగ, కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య, పంచముఖికి పద్మ పురస్కారాలు లభించడంపై రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. వారు తమ తమ రంగాల్లో చేసిన విశేష కృషి, అంకితభావం వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలకు ఎంపికయ్యేలా చేశాయని అన్నారు. మంద కృష్ణ మాదిగకు పద్మ అవార్డు దక్కడం సంతోషకరమని, మిగతా వారికి కూడా వచ్చి ఉంటే బాగుండేదని చెప్పారు.

 
 
Recent Comments
Leave a Comment

Related News