ఫిలిం సెలబ్రెటీల వ్యక్తిగత ప్రవర్తన మీద జనాలు ఏ స్థాయిలో దృష్టిసారిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పబ్లిక్‌లోకి వారి ప్రతి మాట, కదలిక మీదా జనాల ఫోకస్ ఉంటుంది. మైక్ ముందు మాటల విషయలో, కెమెరాలు ఉన్నపుడు నడవడిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అలా లేని పక్షంలో ఎన్నో ఏళ్ల కష్టం, ప్రతిభతో సంపాదించుకున్న గౌరవం చిన్న ఘటనల కారణంగా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
తమకు సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులతో నాలుగ్గోడల మధ్య ప్రవర్తించినట్లు పబ్లిక్‌లో అందరి ముందు వ్యవహరిస్తే చూసే వారికి అది ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరిగా పేరు సంపాదించిన రాఘవేంద్రరావు పబ్లిక్ బిహేవియర్ మీద ఈ మధ్య తరచుగా విమర్శలు వస్తున్నాయి.
ఆ మధ్య ఒక సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కొణిదెల నిహారికతో రాఘవేంద్రరావు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. ఆమెను దగ్గిరికి తీసుకుంటూ తాకిన తీరు పట్ల సోషల్ మీడియాలో ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్నారు రాఘవేంద్రరావు. మెగా కుటుంబానికి చెందిన అమ్మాయితోనే ఇలా చేస్తే.. మిగతా వాళ్లతో ఆయన ఎలా ప్రవర్తిస్తారో అన్న కామెంట్లు వినిపించాయి.
తాజాగా విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమా ప్రారంభోత్సవ వేడుకలోనూ రాఘవేంద్రరావు వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టిల మీద చేయి వేస్తూ ఆయన ప్రవర్తించిన తీరు చూడడానికి ఇబ్బందికరంగా మారింది. దీని మీద వేరే ఇండస్ట్రీలకు చెందిన జర్నలిస్టులు విమర్శలు గుప్పించారు. తెలుగు నెటిజన్లు కూడా దర్శకేంద్రుడి తీరును తప్పుబట్టారు.
రాఘవేంద్రరావు క్యాజువల్‌గా, వేరే ఉద్దేశం లేకుండా ఇలా ప్రవర్తించి ఉన్నా కూడా.. అదిచూసేవాళ్లకు వేరే ఆలోచన కలిగిస్తుంది. ఆయన పట్ల గౌరవాన్ని తగ్గిస్తుంది. కొందరు సినీ ప్రముఖులు వయసు ప్రభావంతో మాట, చేత విషయంలో అదుపు తప్పడం చాలా సందర్భాల్లో చూశాం. రాజేంద్ర ప్రసాద్ సైతం తన మాటతీరుతో ఈ మధ్య ఎంతగా విమర్శల పాలయ్యారో తెలిసిందే. ఇప్పుడు రాఘవేంద్రరావు తన వ్యవహారశైలితో విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు. ఇకపై ఆయన కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిదేమో.