వైసీపీ టు జనసేన.. అవంతి నెక్స్ట్ ప్లాన్ అదేనా..?

admin
Published by Admin — June 24, 2026 in Politics, Andhra
News Image

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్(Avanti Srinivas) స్టైలే వేరు. ఎక్కడ ఏ గాలి వీస్తుందో.. ఏ పార్టీ వైపు వెళ్తే విజయావకాశాలు ఉంటాయో ముందే పసిగట్టడంలో ఆయన పక్కా ప్లానింగ్‌తో ఉంటారనే పేరుంది. అందుకే గతంలో ఆయన పోటీ చేసిన ప్రతిసారీ వేర్వేరు పార్టీల నుంచి బరిలోకి దిగినా, విజయం మాత్రం ఆయననే వరించింది. ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ.. ఇలా మూడు వేర్వేరు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన ట్రాక్ రికార్డ్ అవంతి సొంతం. అయితే, 2024 ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయిన ఈ మాజీ మంత్రి, ఇప్పుడు మళ్లీ పొలిటికల్ రీఛార్జ్ మోడ్‌లోకి రావడం కోస్తా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గత ఎన్నికల్లో కూటమి ప్రభంజనంతో వైసీపీ(YCP) పరాజయం పాలైన కొద్ది రోజులకే అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాల వల్ల సొంత విద్యాసంస్థల నిర్వహణ దెబ్బతింటోందని, అందుకే కాస్త గ్యాప్ తీసుకుంటున్నానని అప్పట్లో ఆయన కవరింగ్ ఇచ్చుకున్నా.. అసలు కథ వేరే ఉందనే ప్రచారం అప్పుడే మొదలైంది. కొన్నాళ్లు న్యూట్రల్‌గా ఉన్నట్లు కనిపించినా, లోలోపల మాత్రం భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై ఆయన పక్కా సర్వేలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి పవర్‌ఫుల్‌గా ఉండటంతో.. ఏదో ఒక అధికార పక్షంలో చేరితేనే సేఫ్ అనుకునే క్రమంలో ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

అవంతి శ్రీనివాస్ జనసేన వైపు అడుగులు వేయడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఆయనకు తొలి విజయాన్ని అందించిన మెగాస్టార్ చిరంజీవి(MegaStar Chiranjeevi) కుటుంబంతో ఆయనకు పాత పరిచయాలు, మంచి సెంటిమెంట్ ఉన్నాయి. దీనికి తోడు ఉత్తరాంధ్ర, ముఖ్యంగా అనకాపల్లి, భీమిలి పరిసర ప్రాంతాల్లో ఉన్న కాపు సామాజికవర్గ సమీకరణాలు కూడా ఆయనకు ప్లస్ కానున్నాయి. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే భీమిలి రెండు ముక్కలవుతుందని, అప్పుడు జనసేన తరపున పోటీ చేయడం ఈజీ అవుతుందని అవంతి లెక్కలు వేసుకుంటున్నారట. ఒకవేళ అసెంబ్లీ కుదరకపోతే, అనకాపల్లి నుంచి మరోసారి లోక్‌సభ బరిలో నిలిచినా సేఫ్ అని ఆయన భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాల టాక్.

మరోవైపు జనసేన అధిష్టానం కూడా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బలమైన, సీనియర్ నాయకుల కోసం చూస్తోంది. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు అవంతి జనసేన(Janasena)పై తీవ్ర విమర్శలు చేసినా.. పాలిటిక్స్‌లో శాశ్వత శత్రుత్వాలు ఉండవనే సూత్రాన్ని ఇరుపక్షాలూ నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ బయటికి సైలెంట్‌గా ఉన్నా, తన అనుచరులతో మాత్రం త్వరలోనే ‘గ్లాస్’ పట్టుకోవడం ఖాయమనే హింట్స్ ఇస్తున్నారట. మరి ఈ సీనియర్ లీడర్ ఊహాగానాలకు తెరదించి జనసేన కండువా ఎప్పుడు కప్పుకుంటారో చూడాలి.

Tags
Avanti Srinivas Janasena YSRCP Andhra Pradesh Politics AP Politics Pawan Kalyan
Recent Comments
Leave a Comment

Related News