విజయనగరం(Vizianagaram) అంటేనే చారిత్రక వైభవానికి, రాజసం ఉట్టిపడే సంస్కృతికి నిలయం. అయితే, కాలం మారింది... రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ, ఈ గడ్డపై గజపతుల ముద్ర చెరిగిపోలేదు. పీవీజీ రాజు కాలం నుంచి మొన్నటి అశోక్ గజపతిరాజు వరకు పూసపాటి వంశాన్ని విజయనగరం ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఎనిమిది సార్లు పోటీ చేసి ఏడు సార్లు అసెంబ్లీకి వెళ్లడం, మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో కొనసాగుతూ అశోక్ గజపతిరాజు సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. అయితే నిన్నటివరకు పెద్దల నీడలో సాగిన రాజకీయం, ఇప్పుడు తర్వాతి తరం చేతుల్లోకి వెళ్తోంది. కోటపై జెండా ఎగరేసేందుకు వారసులు సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతున్నారు.
అశోక్ గజపతిరాజు(Ashok GajapathiRaju) రాజకీయ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి, 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అదితి గజపతిరాజుకు ఇప్పుడు అసలైన సవాల్ ఎదురుకాబోతోంది. విజయనగరం రాజకీయాల్లో గజపతులకు ధీటుగా ఎదిగిన కోలగట్ల వీరభద్రస్వామి (మాజీ డిప్యూటీ స్పీకర్) తన కుమార్తె శ్రావణిని 2029 సమరానికి సిద్ధం చేస్తున్నారు. విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా పనిచేసి, గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలకు దగ్గరైన శ్రావణి.. వైఎస్సార్‌సీపీ తరఫున అదితి గజపతిరాజుకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు గజపతుల వారసురాలు, మరోవైపు కోలగట్ల వారసురాలు.. ఈ ఇద్దరు చదువుకున్న మహిళా నేతల మధ్య పోరు విజయనగరాన్ని హీటెక్కిస్తోంది.
అధికారంలో ఉన్నప్పటికీ అదితి గజపతిరాజు(Aditi GajapathiRaju)పై స్థానికంగా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. తండ్రిలా జనంలోకి వెళ్లకుండా, కేవలం కొద్దిమంది నమ్మకస్తులైన నేతలపైనే ఆధారపడుతున్నారనే టాక్ నడుస్తోంది. రెండున్నరేళ్ల పాలన ముగుస్తున్న తరుణంలో, ఆమె తన శైలిని మార్చుకోకపోతే సొంత పార్టీలోనే ముఠా తగాదాలు ముదిరే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇదే తరుణంలో, కోలగట్ల శ్రావణి పార్టీ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు. విజయనగరంలో కోలగట్ల సామాజికవర్గం బలంగా ఉండటం, తండ్రి వీరభద్రస్వామికి ఉన్న రాజకీయ చాణక్యం శ్రావణికి ప్లస్ పాయింట్లుగా మారుతున్నాయి.
ఇక ఇది కేవలం ఇద్దరు వారసురాళ్ల మధ్య పోరు మాత్రమే కాదు.. తెర వెనుక కుల సమీకరణాలు, కూటమి సమీకరణాలు కూడా మారుతున్నాయి. విజయనగరం నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన తూర్పు కాపు (బీసీ) సామాజిక వర్గం ఈసారి తమకే సీటు ఇవ్వాలని అటు టీడీపీ(TDP), ఇటు వైఎస్సార్‌సీపీలపై ఒత్తిడి తెస్తోంది. మరోవైపు, కూటమి ధర్మంలో భాగంగా జనసేన కూడా ఈ సీటుపై కన్నేసింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో విజయనగరం వేదికగా జరగబోయే రాజకీయ సమరం ఒక రేంజ్‌లో ఉండబోతోంది. తండ్రుల ఇమేజ్‌ను నమ్ముకుని బరిలోకి దిగుతున్న వారసులు సక్సెస్ అవుతారా? లేక మారుతున్న రాజకీయ గాలిని తట్టుకోలేక వెనుకబడతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.