సోషల్ మీడియాలో ఒక్కోసారి అతి ఉత్సాహం ఎలాంటి నవ్వులపాలు చేస్తుందో చెప్పడానికి తాజా ఉదంతమే ఒక పెద్ద ఉదాహరణ. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి(Basavatarakam Indo American Cancer Hospital ) 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల వేదికగా జరిగిన ఒక ఎమోషనల్ సీన్, చివరకు పొలిటికల్ సర్కిల్స్‌లో ఒక రేంజ్ కామెడీగా మారిపోయింది. వేదికపై ఓ యువతి చెప్పిన 'జగన్ సార్' అనే ఒకే ఒక్క మాటను పట్టుకుని, వైకాపా సోషల్ మీడియా వింగ్ చేసిన హడావుడి, ఆ తర్వాత తేలిన అసలు నిజం చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
విషయంలోకి వెళ్తే.. అనంతపురానికి చెందిన స్వప్న అనే యువతి చిన్న వయసులోనే ప్రాణాంతక బోన్ క్యాన్సర్ బారిన పడింది. ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబానికి నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఆప్తమిత్రుడు, 'NBK హెల్పింగ్ హ్యాండ్స్' నిర్వాహకుడు అయిన అనంతపురం జగన్ (జగదీష్) అండగా నిలిచారు. ఆయనే స్వయంగా బాలయ్య దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం, బాలకృష్ణ వెంటనే స్పందించి బసవతారకం ఆసుపత్రిలో ఉచితంగా మెరుగైన వైద్యం అందించడం జరిగాయి. క్యాన్సర్‌ను జయించిన ఆ యువతి, రజతోత్సవ వేడుకల్లో స్టేజ్‌పైకి వచ్చి తనకు పునర్జన్మ నిచ్చిన బాలయ్యకు, తనకు దేవుడిలా అండగా నిలిచిన ‘జగన్ సార్’కు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది.

అయితే, ఈ స్పీచ్‌లోని ‘జగన్ సార్’ అనే ముక్కను మాత్రమే కట్ చేసిన వైసీపీ(YCP) అభిమానులు, అది తమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించేనని భ్రమపడ్డారు. "చూశారా.. బాలయ్య ఆసుపత్రి ఫంక్షన్‌లో కూడా మా జగన్ అన్నే దిక్కు" అంటూ ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్‌లలో వీడియోను తెగ షేర్ చేస్తూ రచ్చ చేశారు. తీరా కట్ చేస్తే.. అక్కడ ఆ యువతి కృతజ్ఞతలు తెలిపింది వైఎస్ జగన్‌కు కాదు, బాలయ్యకు నీడలా ఉండే అనంతపురం జగన్‌కు అని తేలడంతో వైకాపా తమ్ముళ్లకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.
నిజం బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైకాపా అభిమానులపై ట్రోలింగ్ మామూలుగా లేదు. "అతి ఉత్సాహంతో బాలయ్య భక్తుడిని తీసుకెళ్లి వైఎస్ జగన్(Jagan) ఖాతాలో వేస్తారా?" అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పేరు ఒక్కటైనంత మాత్రాన ఊదరగొట్టేయడం కాదు, కాస్త వెనకా ముందు చూసుకోవాలంటూ కౌంటర్లు పడుతున్నాయి. మొత్తానికి, బాలయ్య వేదికపై వైసీపీకి ఉచిత పబ్లిసిటీ దొరికిందని సంబరపడ్డ వారికి, ఈ 'అనంతపురం జగన్' వ్యవహారం అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది.