కవితను ఎత్తుకెళ్లిన పోలీసులు.. ఉప్పల్‌లో ఉద్రిక్తత.!

admin
Published by Admin — July 02, 2026 in Politics, Telangana
News Image

హైదరాబాద్ శివార్లలోని బోడుప్పల్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత చేపట్టిన 'భూపోరాటం' తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఉద్యమకారులతో కలిసి ఆమె ఉప్పల్ పరిధిలో భారీ నిరసనకు దిగారు. అయితే, ఈ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా చేతులు దాటిపోయింది.

ధర్నా చేస్తున్న కవితను, పార్టీ శ్రేణులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర నెట్టులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు కవిత(Kavitha)ను బలవంతంగా ఎత్తుకెళ్లి పోలీస్ వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో కవిత ఒక్కసారిగా కిందపడిపోవడంతో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. మహిళా లీడర్ అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై అక్కడున్న వారంతా విస్తుపోయారు. చివరకు ఆమెను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోలీసుల తీరుపై కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బొల్లారం పోలీస్ స్టేషన్ వేదికగా మీడియా ముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "హైదరాబాద్(Hyderabad) నడిబొడ్డున ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల, మహిళల రక్తం చిందింది. మహిళలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడం అత్యంత అన్యాయం" అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి, ఇప్పుడు అడిగితే లాఠీలతో కొడతారా అని నిలదీశారు.

ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే రక్తం చిందించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించిన కవిత.. ఈ రోజు నుంచే కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని లాఠీలు ఝుళిపించినా, ఎన్ని అరెస్టులు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తామని, తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కవిత తేల్చిచెప్పారు. కవిత అరెస్టుతో ప్రస్తుతం ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

https://x.com/OfficeOfKavitha/status/2072564104313839713?s=20

 

Tags
Kavitha Arrest Telangana Rakshana Sena TRS Bhoo Poratam Uppal Protest Hyderabad News Boduppal Tension Telangana Politics
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News