రాజకీయాల్లో ఎప్పుడు ఏ వ్యూహం అమలు చేయాలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడి(CM Chandrababu Naidu)కి తెలిసినంతగా మరెవరికీ తెలియదనడంలో సందేహం లేదు. అయితే, ఈసారి ఆయన కేవలం రాజకీయ వ్యూహాలకే పరిమితం కాకుండా, ప్రజల్లో ఒకడిగా కలిసిపోయే సరికొత్త పంథాను ఎంచుకున్నారు. తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో కనిపించిన కొన్ని దృశ్యాలు.. బాబు మారిన రాజకీయ శైలికి అద్దం పడుతున్నాయి.
సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటన అంటే అధికారులు, ప్రజాప్రతినిధుల హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, కుప్పం(Kuppam)లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. తనను కలిసేందుకు వచ్చిన అధికారులను, స్థానిక నాయకులను కాసేపు హాల్‌లోనే కూర్చోబెట్టిన చంద్రబాబు.. బయట ఎండలో వేచి ఉన్న సామాన్య ప్రజల వద్దకు నేరుగా వెళ్లారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, అర్జీలను స్వీకరించిన తీరు అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. సమస్య ఏదైనా సరే.. తానున్నానంటూ కొందరికి అక్కడికక్కడే ఆర్థిక సాయం, మరికొందరికి సీఎం సహాయ నిధి చెక్కులను అందించి బాబు తన రూటే సపరేటు అనిపించుకున్నారు.
కేవలం అర్జీలు తీసుకోవడమే కాకుండా, కుప్పం భవిష్యత్తుపై తనకున్న విజన్‌ను ప్రజలతో పంచుకున్నారు చంద్రబాబు. ముఖ్యంగా 'స్వర్ణ కుప్పం(Swarna Kuppam)' ప్రాజెక్టుపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఇల్లూ సౌర విద్యుత్ (సోలార్) వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కుప్పం పరిధిలోని గ్రామాల్లో అమలవుతున్న నెట్ జీరో (వ్యర్థాల రహిత) విధానాలు, ఇండక్షన్ కుకింగ్, టెర్రస్ గార్డెనింగ్ వంటి పర్యావరణ అనుకూల పద్ధతులను అడిగి తెలుసుకుంటూ ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.
కాగా, గత కొంతకాలంగా కుప్పం నియోజకవర్గంపై ప్రతిపక్షాలు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు(Chandrababu) తన పర్యటనల వేగాన్ని పెంచడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కంటే భిన్నంగా ఈ ఏడాది పలుమార్లు కుప్పంలో పర్యటించిన ఆయన, క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. లీడర్ల కంటే నేరుగా ఓటర్లతోనే కనెక్ట్ అవ్వడం ద్వారా.. ప్రత్యర్థుల వ్యూహాలకు చంద్రబాబు సైలెంట్‌గా చెక్ పెడుతున్నారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.