భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒకే నటుడు బహుళ పాత్రలు పోషించడం ఎప్పుడూ ఒక పెద్ద సంచలనమే. నటనకు నిలువెత్తు రూపం లాంటి దివంగత నటుడు శివాజీ గణేశన్ 'నవరాత్రి' సినిమాలో తొమ్మిది పాత్రలు పోషించి అప్పట్లో రికార్డ్ సృష్టిస్తే.. ఆ తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్ 'దశావతారం' చిత్రంలో ఏకంగా పది పాత్రల్లో ఒదిగిపోయి సినీ ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేశారు. దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న కమల్ హాసన్(Kamal Haasan) రికార్డును బ్రేక్ చేసేందుకు ఇప్పుడు ఒక స్టార్ కమెడియన్ సిద్ధమయ్యాడు. ఊహించని విధంగా ఏకంగా 11 విభిన్న పాత్రలతో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సాహసం చేస్తున్నాడు.
సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ కమెడియన్‌గా దూసుకుపోతున్న యోగిబాబు(Yogi Babu) ఇప్పుడు ఈ అరుదైన మైలురాయిని అందుకోబోతున్నారు. తనదైన టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే ఆయన.. ఈసారి కేవలం నవ్వించడమే కాదు, తనలోని నటుడిని సరికొత్తగా ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రంలో ఆయన కేవలం కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా.. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా వైవిధ్యమైన షేడ్స్ చూపించబోతున్నారు. ఇందులో కొన్ని కవల పిల్లల క్యారెక్టర్లు కూడా ఉండటం విశేషం. ఒకే నటుడు 11 పాత్రల్లో మెప్పించడం అంటే మామూలు విషయం కాదు, కానీ యోగిబాబు ఈ భారీ ఛాలెంజ్‌ను స్వీకరించి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తున్నారు.
ఈ భారీ ప్రయోగాత్మక చిత్రానికి ఆర్. కిశోర్ కుమార్(R. Kishore Kumar) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా వద్ద శిష్యరికం చేసిన కిశోర్.. ఒక సరికొత్త యాక్షన్ అండ్ కామెడీ కథాంశంతో ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఒక మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం.. ఆ ప్రమాదం వెనుక ఉన్న రహస్యాలను కనుగొనడానికి జరిగే బ్లాక్ బాక్స్ అన్వేషణ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ ప్రమాద మిస్టరీని ఛేదించే క్రమంలో హీరో ఎదుర్కొనే సవాళ్లను అత్యంత వినోదాత్మకంగా, నరాలు తెగే ఉత్కంఠతో తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న చిత్రయూనిట్.. తదుపరి షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఇంగ్లాండ్, కెన్యా వంటి లొకేషన్లలో తదుపరి కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 9 లైట్స్ పతాకంపై సురేష్ ముత్తు నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అతిథి రవి కథానాయికగా నటిస్తోంది. అలాగే రెడిన్ కింగ్స్ లీ, వీటీవీ గణేష్(VTV Ganesh ), పంజు సుబ్బు, ఎ. వెంకటేష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మరి 11 పాత్రలతో యోగిబాబు చేయబోతున్న ఈ అద్భుత ప్రయోగం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.