ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయనే వార్తలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్‌ను ప్రక్షాళన చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే నెలలోనే ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈసారి విస్తరణలో అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులకే పెద్దపీట వేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
ఈ మంత్రివర్గ రేసులో అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే, సీనియర్ నేత కొణతాల రామకృష్ణ(Konathala Ramakrishna) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఉత్తరాంధ్రాలో మంచి పట్టున్న నాయకుడిగా పేరున్న కొణతాలకు ఈసారి బాబు కేబినెట్‌లో ఖచ్చితంగా చోటు దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. సీనియార్టీ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కడం దాదాపు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి.

ప్రస్తుతం ఏపీ కేబినెట్(Ap Cabinet)లో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 24 మంది మంత్రులు ఉన్నారు. నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో గరిష్టంగా 25 మందికి అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం కేబినెట్‌లో ఒకే ఒక్క స్థానం ఖాళీగా ఉంది. అయితే, కేవలం ఆ ఒక్క ఖాళీ పోస్టును భర్తీ చేయడమే కాకుండా.. కొందరు పాత మంత్రుల పనితీరును బేరీజు వేసి, వారి స్థానంలో కొత్తవారికి కూడా ఛాన్స్ ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల మంత్రివర్గంలో మరింత జోష్ పెరుగుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
అంతేకాకుండా, ఈసారి జరగబోయే విస్తరణలో కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ(BJP)లకు ప్రాధాన్యత మరింత పెరగనుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ డెలివరీ మెకానిజంను మరింత వేగవంతం చేసేందుకు, కూటమిలోని అన్ని పార్టీలకు సమన్యాయం జరిగేలా చంద్రబాబు పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు. మరి వచ్చే నెలలో జరగబోయే ఈ కేబినెట్ విస్తరణ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో చూడాలి.