రెండు తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను షేక్ చేస్తున్న పేరు ‘ప్రశ్న రావణ్(Prashna Ravanan)’. యూట్యూబ్‌లో ‘ప్రశ్న’ అనే ఛానెల్ ద్వారా అడుగుపెట్టి, వ్యవస్థలను, రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చాడు బచ్చలకూర జోసెఫ్ అలియాస్ జోసెఫ్ చౌదరి. అయితే, ఈ ప్రశ్న రావణ్ వెనుక ఉన్న అసలు రంగు, ఆయన గత ప్రస్థానం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
ఇప్పుడు యూట్యూబ్(YouTube)లో పెద్దపెద్ద నీతులు చెబుతున్న ఈ రావణ్.. డిజిటల్ మీడియాలోకి రాకముందు ఏం చేసేవాడనే విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ఆయన ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసినట్లు సమాచారం. అయితే, అక్కడ ఆయన ప్రస్థానం ఏమాత్రం సవ్యంగా సాగలేదు కదా సంచలన ఆరోపణలతోనే ముగిసింది. సదరు సంస్థలో పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం డబ్బుకు సంబంధించిన వ్యవహారాలే కాకుండా, అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగుల పట్ల కూడా ఆయన ప్రవర్తన సరిగ్గా లేదనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
రావణ్(Ravanan) వేధింపులు ఏ స్థాయికి చేరాయంటే.. ఆయన పనిచేసిన సంస్థలో ఒక మహిళా ఉద్యోగిని తీవ్రమైన లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఆ మానసిక క్షోభను తట్టుకోలేక సదరు మహిళ ఆత్మహత్యాయత్నానికి కూడా ఒడిగట్టిందనే షాకింగ్ విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ తీవ్రమైన ఉదంతంతో స్పందించిన సదరు సంస్థ యాజమాన్యం, రావణ్‌ను ఉద్యోగం నుంచి బూట్‌కట్ చేస్తూ తక్షణమే తొలగించినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ పాడుపనుల అధ్యాయం ముగిసిన తర్వాతే, ఆయన తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ‘ప్రశ్న రావణ్’గా అవతారమెత్తాడనే చర్చ సాగుతోంది.
ఇక రాజకీయంగా ఒక వర్గానికి కొమ్ముకాస్తూ.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రావణ్ తీవ్ర పదజాలంతో దూషణలకు దిగాడు. ఇటీవల సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, ఏలూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్‌ను దారుణంగా విమర్శించడంతో కథ అడ్డం తిరిగింది. కూటమి నేతలు, శ్రేణులు ఇచ్చిన ఫిర్యాదులతో ఏపీవ్యాప్తంగా రావణ్‌పై ఏకంగా 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి వరుస బెయిళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన మరుక్షణమే.. రావణ్‌కు సంబంధించిన ఒక ప్రైవేట్ రాసలీలల వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి సంచలనం సృష్టిస్తోంది. ఇటు వీడియో వైరల్ అవుతుండగానే, ఇంటికి వెళ్తున్న రావణ్‌ను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకోవడం ఈ హైడ్రామాలో అసలైన ట్విస్ట్. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే రావణ్ చుట్టూ ఇప్పుడు అవినీతి, మహిళల వేధింపుల ఉచ్చు గట్టిగా బిగుసుకుంది. ఈ ఆరోపణలపై రావణ్ ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.