మీలో ఉన్న ప్రతిఒక్కరూ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లే. మీరు విజయాన్ని సాధించినప్పుడు, వ్యాపారం ప్రారంభించినప్పుడు, మంచి పేరును సంపాదించినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ గర్వపడుతుంది. మీరు వెళ్ళే ప్రతీచోట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గాథను చెప్పాలన్నది నా ఆకాంక్ష అని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సియోల్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ``మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించండి, వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలనను తెలియజేయండి. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరండి. ఒకసారి మనరాష్ట్రాన్ని చూసినవారు... వెంటనే మన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారు. ఏ రంగంలోనైనా కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది. మేం నిజాయితీతో ప్రతి పెట్టుబడిదారుడికీ స్వాగతం పలుకుతాం. ప్రతి ఆవిష్కర్త కంపెనీని మేం ఆదరిస్తాం. భారతదేశంతో కలిసి పనిచేసే ఆసక్తి ఉన్న ప్రతీ వ్యక్తికీ మేము స్వాగతం పలుకుతాం.``
*ఎన్ఆర్ఐల ప్రతి విజయం దేశానికి గర్వకారణం*
ప్రపంచంలో తెలుగు ప్రజలు లేని దేశం లేదు. ఏ దేశంలో, ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ తెలుగు ప్రజల ఉనికి ఉంటుంది. నేను ఎక్కడికెళ్లినా నా పరిచయాలు తెలుగు సమాజంతోనే మొదలవుతాయి. విదేశాల్లో ఉంటున్న తెలుగువారికి తమ దేశం, సంస్కృతిపై అపారమైన ప్రేమ. వారు ఎంత దూరంలో ఉన్నా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తారు. దక్షిణ కొరియాలోని భారతీయ సమాజానికి నా హృదయపూర్వక అభినందనలు. ఎంబసీ అధికారులు, నిర్వాహకులు, ఈ వేదిక ఏర్పాటుచేసిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశం నుంచి దూరంగా ఉన్న ప్రతీ భారతీయుడినీ కలిసిన ప్రతిసారీ నాకు ఒకింత గర్వంగా ఉంటుంది. మీ కష్టపడేతత్వం, నైపుణ్యం, సంకల్పం ద్వారా మీరు భారత్‌కు గౌరవాన్నిఇనుమడింపజేస్తున్నారు. మీ ప్రతి విజయం భారతదేశ ప్రతిష్టను పెంచుతుంది.
*దక్షిణకొరియా విజయగాథ మనకు ప్రేరణ*
దక్షిణ కొరియా అభివృద్ధి ప్రయాణం ఆదర్శనీయం. దక్షిణ కొరియా ఇప్పుడు Samsung, Hyundai, LG, Kia వంటి ప్రఖ్యాత కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుతున్నాయి. సంపద కేవలం ప్రకృతి వనరుల ఆధారంగా రాదని.. శ్రమ, ఆవిష్కరణ, శాస్త్రీయ దృక్పథం, తపన ద్వారానే దేశాలు అభివృద్ధిపథంలో ముందుంటాయని దక్షిణ కొరియా నిరూపించింది. దక్షిణ కొరియా విజయగాథ మనకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి పెద్ద ప్రేరణ. భారత్ - దక్షిణ కొరియా మధ్య సంబంధం కేవలం వాణిజ్యం మాత్రమే కాదు. మన భాగస్వామ్యం ప్రజాస్వామ్య విలువలు, పరస్పర విశ్వాసం, ఆవిష్కరణ, యువతపై పెట్టుబడి అనే పటిష్ట మూలాలపై ఆధారపడి ఉంది. గత కొన్ని సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, సెమీ కండక్టర్లు, షిప్ బిల్డింగ్, గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉన్నత విద్య వంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి మంచి ఫలితాలను సాధించాయి.
*కియాతో ఆటో మొబైల్ ఎకోసిస్టమ్ అభివృద్ధి*
కియా విజయగాథ మనకు ఆదర్శం. కియా తమ మొదటి ఇన్-ఇండియా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి స్థలాలు అన్వేషిస్తున్నపుడు ఆంధ్రప్రదేశ్ తక్షణ నిర్ణయం తీసుకొని, పారదర్శకత, వేగవంతమైన అనుమతులు, భూమి, మౌలిక సదుపాయాలను సమకూర్చి నిజమైన భాగస్వామిగా నిలిచింది. ఫలితంగా ఆవిష్కృతమైందే కియా ప్లాంట్. కేవలం కార్ల తయారీ కేంద్రంగానే కాకుండా, ఒక పూర్తిస్థాయి ఆటోమొబైల్ ఎకోసిస్టమ్‌గా మారి, వేలాదిమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించింది. మన ఈ ప్రయాణాన్ని మరిన్ని సక్సెస్ స్టోరీలుగా మార్చాలి. ఐటీ, సెమికండక్టర్లు, మొబిలిటీ, బ్యాటరీ టెక్నాలజీలు, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్ — ఏ రంగంలోనైనా ఆంధ్రప్రదేశ్ దక్షిణ కొరియాకు భారతదేశంలో అత్యంత నమ్మకమైన భాగస్వామి కావడానికి సిద్ధంగా ఉంది. వచ్చే దశాబ్దం ఏపీ కేంద్రంగా భారత్-దక్షిణ కొరియా సంబంధాలు మరింత బలపడతాయని నేను విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో కొత్త భాగస్వామ్యాలు వికసిస్తాయి.
*యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం*
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త అభివృద్ధి దశలోకి ప్రవేశించింది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో మేం పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి పొంది, యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాం. ప్రపంచ పెట్టుబడిదారులు ఇటీవల చూస్తున్న వేగంగా నిర్ణయాలు తీసుకోవడం (స్పీడ్), పాలనా స్థిరత్వం (స్టెబిలిటీ), పెట్టుబడి తర్వాత నాణ్యమైన సేవ (సర్వీస్)లు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఏపీ అనుసరిస్తున్న 3S (Speed, Stability, Service) మోడల్ తో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో పెట్టుబడిదారులకు నమ్మకమైన ప్రాంతంగా మారింది. మేం అనుసరిస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాల వల్లే ఇది సాధ్యమైంది.
*పరిశ్రమ అవసరాల మేరకు విద్యావ్యవస్థలో మార్పులు*
ప్రతి సంవత్సరం లక్షలాది యువత ఉద్యోగ ప్రపంచంలోకి అడగుపెడుతున్నారు. వారికి అర్హతల ఆధారంగా నైపుణ్యాలు, అవకాశాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వంగా మాపై ఉంది. ఇందుకోసం మేము విద్యా వ్యవస్థను సమగ్రంగా పునఃరూపకల్పన చేసుకుంటున్నాం. మా పాఠ్యాంశాలను అధునాతన పరిశ్రమ క్లస్టర్ల ఆధారంగా రూపొందిస్తున్నాం. దీనివల్ల విద్యార్థులు పరిశ్రమల అవసరాల మేరకు సిద్ధం కావడంతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు, ప్రాక్టికల్ అనుభవం పొందుతారు. మన విద్యార్థులు గ్లోబల్ స్థాయి ఉద్యోగాల కోసం సన్నద్ధమవ్వాలి. సియోల్, టోక్యో, బెర్లిన్, సిలికాన్ వ్యాలీ ఎక్కడైనా పోటీ పడగలగాలి. అంతర్జాతీయ భాషలను ప్రోత్సహించడం ద్వారా వారి అవకాశాలను మద్దతుగా నిలుస్తున్నాం.
*బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి*
``తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో బలమైన పునాది కలిగి ఉంది. కానీ మన దృష్టి ఎప్పుడూ జాతీయస్థాయిలో ఉంది. బలమైన రాష్ట్రాలే బలమైన భారత్ ని నిర్మిస్తుందని మేము బలంగా నమ్ముతాం. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ అభివృద్ధి ప్రణాళికలు కలిసి ముందుకు సాగితేనే విజయం సాధిస్తామన్నది మా నమ్మకం. మీరు వేల కిలోమీటర్ల దాటి ఇక్కడకు వచ్చినా ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఎప్పుడూ దూరంగా లేరు. APNRT ద్వారా మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలకు మద్దతుగా ఉంటూ, విద్యార్థులు, కార్మికులకు అత్యవసర సాయం, సేవలు అందిస్తూనే ఉంటాం. గ్లోబల్ కమ్యూనిటీకి మద్దతుగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ మీ వెంటే ఉంటుంది. కొరియా ఒక అద్భుత దేశంగా రూపుదిద్దుకుంది. భారత్ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అవకాశాలతో నిండిన భవిష్యత్తును నిర్మిస్తోంది. మనం కలిసికట్టుగా ఆ యజ్ఞంలో భాగస్వాములం అవుదాం. మరిన్ని పెట్టుబడులను ఆకర్షిద్దాం, ఎక్కువ ఉద్యోగాలను సృష్టిద్దాం, అధునాతన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేద్దాం, మరిన్ని ఆవిష్కరణలను ప్రోత్సహిద్దాం. ఆంధ్రప్రదేశ్‌ను జీవించడానికి, పనిచేయడానికి, పెట్టుబడి పెట్టడానికి అత్యుత్తమ ప్రదేశంగా మార్చుదాం. కలిసికట్టుగా బలమైన ఆంధ్రప్రదేశ్, బలమైన భారత్ ను నిర్మిద్దాం`` అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.