యూట్యూబర్ జోసెఫ్ రావణ్(Joseph Raavan) అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలను బయటపెట్టారు. రావణ్ కేవలం సోషల్ మీడియా కంటెంట్ మేకర్‌గా కాకుండా, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు పేర్కొన్న అంశాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. జోసెఫ్ రావణ్‌పై రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు స్టేషన్లలో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల్లో అలజడి రేపేలా ఆయన వ్యవహరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులే లక్ష్యంగా రావణ్(Raavan) చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
ఈ రిపోర్ట్‌లో అత్యంత సంచలనమైన అంశం.. నిషేధిత మావోయిస్టు సంస్థలకు మద్దతుగా రావణ్ మాట్లాడటం. దేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్లలో ఒకరైన హిడ్మా(Hidma)ను కీర్తిస్తూ ఆయన ప్రసంగాలు చేశారని పోలీసులు స్పష్టం చేశారు. అమాయక యువతను, విద్యార్థులను నిషేధిత మావోయిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షించేలా, వారిని తప్పుదోవ పట్టించేలా రావణ్ సోషల్ మీడియా వేదికగా వ్యూహాత్మకంగా వ్యవహరించారని రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
ఇటీవల ఏలూరు(Eluru)లో జరిగిన 'దళిత క్రైస్తవ సమావేశం'లో జోసెఫ్ రావణ్ చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపింది. ఆ సభలో ఆయన అత్యంత రెచ్చగొట్టేలా మాట్లాడటమే కాకుండా.. దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను ఉద్దేశించి అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆధారాలతో సహా రిపోర్ట్‌లో పొందుపరిచారు. ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయవ్యవస్థలపై సామాన్య ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు పెంచడమే ధ్యేయంగా రావణ్ కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన ఆరోపణ. సమాజంలో విద్వేషాలు రగిల్చేలా ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను, దీని వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును ముమ్మరం చేశారు.