రాష్ట్రాలు, భాషలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా.. దేశవ్యాప్తంగా అందరూ వందేమాతరం గేయాన్ని ఆలపించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ సమైక్యత, జాతీయ ఏకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా.. జాతీయ కార్యక్రమమైనా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఇదీ ఆదేశం..
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్వహించే స్థానిక ప్రభుత్వ కార్యక్రమాలు, జాతీయ పండుగలు, వేడులకు, దేశ నాయకుల జయంతులు, వర్థంతుల వంటి కార్యక్రమాల్లో తొలుత వందేమాతరం గేయాన్ని ఆలపించాలి. అది కూడా.. 3నిమిషాల 10 సెకన్ల పాటు ఉన్న ఆరు చరణాలను సంపూర్ణంగా రాగ, భావయుక్తంగా ఆలపించాలి. దీనిలో ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదు. గవర్నర్ల కార్యాలయాల్లో జరిగే కార్యక్రమాల్లోనూ ఆలపించాలి. అని పేర్కొంది.
అనంతరం.. జనగణమన.. జాతీయ గీతాన్ని కూడా సంపూర్ణంగా ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు అయిన తర్వాతే.. రాష్ట్ర స్థాయిలో ఏదైనా గీతం కానీ, గేయం కానీ, పాట కానీ ఉంటే.. దానిని ఆలపించాలని స్పష్టం చేసింది. తొలుత వందేమాతరం, తర్వాత జనగణమన, ఆ తర్వాతే రాష్ట్ర గీతం, గేయం, పాట, కవిత వంటివాటిని ఆలపించాలని పేర్కొంది. ఇది జాతీయ సమైక్యతను దృష్టిలో పెట్టుకుని చేసిన నిబంధనగా కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.
ఎందుకిలా?
ఇటీవల తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో వందేమాతరం, జనగణమన, స్థానిక గేయాల విషయంలో వివాదం చెలరేగింది. తొలుత తమ రాష్ట్రగీతాలను ఆలపిస్తామని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి. కానీ, ఆయా రాష్ట్రాల గవర్నర్లు దీనికి ఒప్పుకోలేదు. దీంతో తమిళనాడులో పెద్ద వివాదమే చెలరేగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతాజాగా మార్గదర్శకాలతో పాటు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అన్ని పాఠశాలల్లోనూ.. వందేమాతరం గేయాన్ని పూర్తిగా పాడాలని రెండు మాసాల కిందటే ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.