ఏపీ సీఎం నారా చంద్రబాబు కుటుంబానికి మరో అరుదైన గౌరవం, గుర్తింపు లభించింది. 'ఫార్చ్యూన్ ఇండియా' మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ జాబితాలో నారా వారి కోడలు, మంత్రి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే వ్యాపార రంగంలో ఆమెకు పలు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ వ్యాపార సంస్థ ఫార్చ్యూన్ ఇండియా జాబితాలోనూ బ్రాహ్మణికి చోటు లభించింది.
ఎందుకు ఇస్తారు?
బిజినెస్, ఫైనాన్స్, నాయకత్వ రంగాల్లో రాణిస్తున్న అత్యంత ప్రభావవంతమైన మహిళల కోసం ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ పేరుతో వారి పేర్లను ముద్రించడంతోపాటు.. అవార్డులను కూడా అందిస్తుంది. విస్తృత వ్యాపార ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తూ, కంపెనీలను విజయపథంలో నడిపిస్తున్న 100 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, నాయకులను ఈ జాబితాలో చేరుస్తారు. ఏటా గత 15 సంవత్సరాలుగా ఫార్య్చూన్ ఇండియా ఈ అవార్డులను అందిస్తోంది.
ఫార్య్చూన్ ఇండియా ఈ అవార్డును కైవసం చేసుకున్న నారా బ్రాహ్మణికి సీఎం చంద్రబాబు అభినందన లు తెలిపారు. ``బ్రాహ్మణికి ఫార్య్చూన్ ఇండియా శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కడం అభినందనీయం. బ్రాహ్మణి నాయకత్వం, అంకితభావానికి దక్కిన అరుదైన గుర్తింపు. భవిష్యత్ లో మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా`` అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
బ్రాహ్మణికి ఎందుకంటే..
నారా బ్రాహ్మణి శక్తిమంతమైన మహిళగా గుర్తింపు తెచ్చుకోవడానికి.. ఆమె నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్ సంస్థలే కీలకంగా మారాయి. వీటితోపాటు క్రికెట్ సహా.. పలు క్రీడలను ఆమె ప్రోత్సహిస్తున్నారు. యువత లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీస్తున్నారు. మరోవైపు.. తాను సొంతగా పర్వతారోహణ సహా.. స్కేటింగ్ వంటి రంగాల్లో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణికి ఈ అరుదైన గుర్తింపు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో అవార్డును ఆమె అందుకున్నారు.